బీజేపీకి అధికారం.. కేసీఆర్ కు విశ్రాంతి అవసరం

 
బీజేపీకి అధికారం.. కేసీఆర్ కు విశ్రాంతి అవసరమని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత ముగింపు సందర్భంగా కరీంనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రజాస్వామ్యంపై కేసీఆర్ కు నమ్మకం లేదా అని ప్రశ్నించారు. 
 
మోదీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని చెబుతూ. కేసీఆర్ సర్కారు మాత్రం అవినీతిలో మునిగి తేలుతోందని విమర్శించారు. కేంద్ర కేబినెట్ లో బీసీ, ఎస్సీలకు న్యాయం చేశామని తెలిపారు. తెలంగాణలో కేంద్ర నిధులతో 5వేల కిలోమీటర్ల రోడ్లు వేశామని చెప్పారు.
 
కేసీఆర్ తీరు ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగిరినట్లుగా ఉందని నడ్డా ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌ పాలనంతా అవినీతి, అక్రమాలేనని దుయ్యబట్టారు.  ప్రజాసంగ్రామ యాత్ర ఆరంభం మాత్రమే.. ఆగేది కాదని ప్రకటించారు. ప్రజా గోస-బీజేపీ భరోసా కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ వెంటే ఉంటారని నడ్డా భరోసా వ్యక్తం చేశారు. 
 
ఒకప్పుడు ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పులకుప్పగా మార్చేశారని పేర్కొంటూ  దోచుకోవడం, దాచుకోవడమే కేసీఆర్‌ సర్కార్‌ పనిగా పెట్టుకుందని విమర్శించారు. రూ. 3.92 లక్షల కోట్ల లోటులో ప్రస్తుతం తెలంగాణ ఉందని తెలిపారు. బీఆర్‌ఎస్ త్వరలోనే వీఆర్‌ఎస్‌ కాబోతుందని ఎద్దేవాచేశారు. 
 
దళితుడిని సీఎం చేస్తామన్న కేసీఆర్‌ హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు కుటుంబ పాలన తప్ప ప్రజాసంక్షేమం పట్టదని స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే కేసీఆర్‌ను గద్దె దించగలదని జేపీ నడ్డా ధీమా వ్యక్తం చేశారు. 
 
సీఎం కేసీఆర్ కు కొడుకు, కూతురు, అల్లుడు తప్ప ఎవరూ కనిపించడం లేదని చెబుతూ కుటుంబవాదాన్ని వ్యాపింపజేసే ప్రయత్నంలో భాగంగానే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ధ్వజమెత్తారు.క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు అవినీతి, అక్రమాలకు తెగబడ్డారని ఆరోపించారు. ధరణి పోర్టల్ ను వాడుకొని టీఆర్ఎస్ వాళ్లు అక్రమ సంపాదన పోగేస్తున్నారని మండిపడ్డారు. 
 
కవితను ఎందుకు విచారిస్తున్నాయి?
 
దర్యాప్తు సంస్థలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఎందుకు విచారిస్తున్నయ్ అని నడ్డా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణ సాధన కోసం అమరులైన వారి ఆశయాలకు కేసీఆర్ తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. 
 
‘‘ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వెల్ నెస్ సెంటర్ల పేర్లను బస్తీ దవాఖానాలుగా కేసీఆర్ మార్చేసిండు.. ఒరిజినల్ ను డూప్లికేట్ గా మార్చడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య..  డూప్లికేట్ ఎవరో , ఒరిజినల్ ఎవరో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు..’’ అని నడ్డా పేర్కొన్నారు. ‘‘సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం జరగాలని కేసీఆర్ భావించడు.. ఎందుకంటే ఆయన ఓవైసీతో చేతులు కలిపాడు’’ అని ధ్వజమెత్తారు.
 
రజాకార్ల అరాచకాలను ప్రపంచానికి తెలియజేసేందుకు సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తాము ఘనంగా జరిపి తీరుతమని స్పష్టం చేశారు. రూ.3,106 నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ ఇచ్చిన హామీ కాగితానికే పరిమితమైందని విమర్శించారు. ‘‘కేసీఆర్ ను కూకటి వేళ్లతో పెకిలించి పారేయగలిగేది బీజేపీ మాత్రమే. కుటుంబవాదాన్ని వ్యతిరేకంచే వాళ్లంతా తెలంగాణలో బీజేపీతో కలిసిరావాలి’’ అని నడ్డా పిలుపునిచ్చారు.
 
‘బీజేపీ యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ వాళ్లు ప్రయత్నించారు. వాళ్లకు నేనొకటి చెప్పదల్చుకున్న.. ఇది ప్రజాస్వామ్యం.. దీనిలో ఇతరుల గొంతు నొక్కే ప్రయత్నం జరగకూడదు.. ఒకవేళ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రజలు నిలువుగా బొందపెడ్తరని కేసీఆర్ తెలుసుకోవాలి’’ అని హెచ్చరించారు.