సోమవారం ఢిల్లీలో కిసాన్ సంఘ్ ‘కిసాన్‌ గర్జన’

సోమవారం ఢిల్లీలో కిసాన్ సంఘ్ ‘కిసాన్‌ గర్జన’

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ కిసాన్‌ సంఘ్‌ (బీకేఎస్‌), భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) ఆందోళనకు దిగుతున్నాయి. ఈ నెల 28న నాగపూర్ లో ‘మహా మోర్చా’ (భారీ ర్యాలీ) నిర్వహించనున్నట్టు బీఎంఎస్‌ ఇప్పటికే ప్రకటించగా, తాజాగా బీకేఎస్‌ కూడా సోమవారం (డిసెంబర్ 19) దేశ రాజధాని ఢిల్లీలో ‘కిసాన్‌ గర్జన’ నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

దేశానికి అన్నం పెట్టే రైతన్న తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడని, పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా లభించడం లేదని బీకేఎస్‌ తెలిపింది. దీంతో సాగు కోసం తెచ్చిన అప్పు తీర్చ లేక, చేసిన కష్టానికి ప్రతిఫలం దక్కక ఆత్మహత్య చేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

అన్ని పంటలకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని, వ్యవసాయ ఉత్పత్తులపై జీఎస్టీని విధించరాదని, కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద అందజేస్తున్న పంట సాయాన్ని పెంచాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల విధానం దేశ ప్రజల ప్రయోజనాలను కాపాడేలా ఉండాలని సూచించింది.

తద్వారా ఇటు ప్రజలు, అటు రైతులకు లాభం చేకూరుతుందని తెలిపింది. జాతీయస్థాయిలో నిర్వహించనున్న ఈ కిసాన్‌ గర్జన నిరసన ప్రదర్శనలో దేశవ్యాప్తంగా ఉన్న రైతులు పాల్గొంటారని బీకేఎస్‌ వెల్లడించింది.

మరోవంక, కేంద్రం అవలంబిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాలు, ప్రైవేటీకరణ, ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ 28న నాగ్‌పూర్‌లో మహా మోర్చా నిర్వహించనున్నట్టు బీఎంఎస్‌ ఇప్పటికే ప్రకటించింది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో విధాన సభను ముట్టడించి తమ నిరసనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలిపింది.

దేశానికి ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు, పాలు మొదలైన వాటిని అందించే రైతులు నేడు తమ వ్యవసాయ ఉత్పత్తులపై సరైన రాబడిని పొందలేక తీవ్ర నిరాశకు గురవుతున్నారని బీకేఎస్ కార్యవర్గ సభ్యుడు నానా అఖారే ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. రైతుల కష్టాలను పరిష్కరించడానికి, బికెఎస్ కేంద్రం నుండి అన్ని రకాల వ్యవసాయ ఉత్పత్తులపై లాభదాయకమైన ధరలను కోరింది. జీఎం (జన్యుపరంగా మార్పు చెందిన) ఆవాల విత్తనాలను ప్రభుత్వం ఆమోదించకూడదని కూడా డిమాండ్ చేస్తున్నది.

ప్రముఖ రైతు నాయకుడు హంసరాజ్ చౌదరి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా రైతు మోసపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయోత్పత్తులపై జీఎస్టీని ఎత్తివేయడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రధానమంత్రి సమ్మాన్ నిధి మొత్తాన్ని పెంచడం, ప్రతి పొలానికి నీరు అందించడం వంటి రైతులకు సంబంధించిన అన్ని సమస్యలపై ఈ రైతులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తారని ఆయన వివరించారు.