భారత్ చరిత్ర గతిని మార్చిన 1971 యుద్ధం 

* విజయ దివాస్ .. 51వ వార్షికోత్సవం సందర్భంగా సంస్మరణ 
 
సంవత్సరం 1971 మరియు నవంబర్ నెల. ‘‘పాకిస్థాన్‌ విషయంలో భారత్‌  జోక్యం చేసుకొంటే అమెరికా ముక్కున వేలేసుకొని ఊరికే కూర్చోదు..  భారతదేశానికి తగిన గుణపాఠం చెబుతుంది” నవంబర్, 1971లో అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ అహంకారంతో అన్న మాటలు.

“భారతదేశం అమెరికాను స్నేహితుడిగా పరిగణిస్తుంది. బాస్ కాదు. భారతదేశం తన విధిని తానే రాసుకోగలదు. పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్కరితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు. మాకు అవగాహన ఉంది” అంటూ ఎంతో మనోధర్యంతో భారత ప్రధాని ఇందిరా గాంధీ ఘాటుగా జవాబిచ్చారు.

 అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌లో రిచర్డ్ నిక్సన్‌ కళ్ళలోకి నేరుగా చూస్తూ ఖచ్చితంగా ఆమె జవాబివ్వడం మొత్తం అమెరికా ప్రభుత్వాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. అక్కడకు వెళ్లి ఇప్పటి వరకు భారత ప్రభుత్వ నేతే కాదు, ప్రపంచ నేతలు ఎవ్వరు అంత కరకుగా, ధీటుగా అమెరికా అధ్యక్షుడికి జవాబు ఇచ్చిన దాఖలాలు లేవు.
ఈ సంఘటనను ప్రత్యక్ష సాక్షి అయిన అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి, జాతీయ భద్రతా సలహాదారుడు స్వయంగా  హెన్రీ కిస్సింజర్ తన ఆత్మకథలో వివరించాడు. మరో నెల రోజులలో అమెరికా ఎంతగా వెనుకవేసుకొంటూ వచ్చినా పాకిస్థాన్ రెండు ముక్కలైంది. బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఆవిర్భవించింది. 
 
ఈ రోజు దేశం 51వ ‘ విజయ్ దివస్’ జరుపుకుంటున్న వేళ, 1971 యుద్ధం రెండు దేశాల మధ్య జరిగే సాధారణ యుద్ధం కాదు కాబట్టి దాన్ని చూసిన ప్రజల మదిలో జ్ఞాపకాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.  పైగా, కేవలం 13 రోజుల యుద్ధంలో మనకన్నా రెండు, మూడు రెట్లున్న పాకిస్థాన్ సైన్యంపై భారత సైనికులు చారిత్రాత్మక విజయం సాధించారు.
భారత సైనికుల ముందు 93,000 మంది పాకిస్థాన్ సైనికులు అత్యంత అవమానకరమైన రీతిలో లొంగిపోవడమే కాకుండా, కొత్త దేశాన్ని సృష్టించేందుకు దారితీసింది.   స్వతంత్ర భారతదేశంలో భారత సైనికులు స్పష్టమైన విజయం సాధించి, శత్రు సైనికులు ఆయుధాలు విడిచి, లొంగిపోయే విధంగా చేసిన యుద్ధం ఇది ఒక్కటే కావడం గమనార్హం.
వాస్తవానికి ఆ నాడు భారతదేశం ఆర్థికంగా, సైనికంగా, ఆయుధ పరంగా అనేక లోటుపాట్లను ఎదుర్కొంటున్నది. కేవలం ధృఢ దీక్ష, అసామాన్యమైన మన సైనికుల పరాక్రమం,  మొత్తం దేశ ప్రజలు ఒక్కటిగా సైనికులకు అండగా నిలబడటం, అసామాన్యమైన దౌత్య విధానం ఈ చారిత్రాత్మక విజయానికి దారితీసింది.
 
అప్పటి నుండే భారత్ ను సైనికంగా, ఆర్ధికంగానే కాకుండా శస్త్ర,  సాంకేతిక,వాణిజ్య రంగాలలో సహితం ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయాలనే ఆలోచనలు, ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో మన సైనికులు సాధించిన విజయానికి సహితం ఈ యుద్ధం అనుభవాలు దోహదపడ్డాయి. 

ఆ రోజున సాధారణంగా జరిగే రెండు దేశాల అధ్యక్షుల ఉమ్మడి మీడియా సమావేశాన్ని ఇందిరా గాంధీ ఏకపక్షంగా రద్దు చేసుకున్నారు. కిస్సింజర్ ఇందిరా గాంధీని తన కారులోకి ఎక్కించుకుంటూ, “మేడమ్ ప్రైమ్ మినిస్టర్, మీరు అధ్యక్షునితో కొంచెం సహనంగా ఉండవచ్చని మీకు అనిపించలేదా?” అని అడిగారు. 
 
ఇందిరా గాంధీ ఇలా బదులిచ్చారు, “మిస్టర్ సెక్రటరీ, మీ విలువైన సూచనకు ధన్యవాదాలు. అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి, మా వెన్నెముక నిటారుగా ఉంది. అన్ని దురాగతాలపై పోరాడటానికి తగినంత సంకల్పం, వనరులు మాకు ఉన్నాయి. ఒక శక్తి వంతమైన దేశం తరచుగా వెల్లమైళ్ళ దూరం నుండి ప్రపంచాన్ని పాలించే రోజులు గడిచిపోయాయని మేము నిరూపిస్తాము” అంటూ ఆమె భారతీయుల ధృడ సంకల్పాన్ని, ఆత్మగౌరవాన్ని స్పష్టం చేశారు.

ఆ తర్వాత, ఆమె ఎయిర్ ఇండియా బోయింగ్ ఢిల్లీలో దిగిన వెంటనే, తిపక్ష నాయకుడు అటల్ బిహారీ వాజ్‌పేయిని తన నివాసానికి పిలిపించారు. మూసివేసిన తలుపుల వెనుక ఒక గంట చర్చ తర్వాత, వాజ్‌పేయి హడావిడిగా వెనక్కి తిరిగి రావడం కనిపించింది. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితిలో వాజ్‌పేయి భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని తెలిసింది. ఒక ప్రతిపక్ష నేతను దేశ ప్రతినిధిగా పంపడం అందరికి ఆశ్చర్యం కలిగించింది.
బిబిసికి చెందిన డొనాల్డ్ పాల్ వాజ్‌పేయికి ఒక ప్రశ్నతో, “ఇందిరా గాంధీ మిమ్మల్ని ఒక గట్టి విమర్శకురాలిగా భావిస్తారు. అయినప్పటికీ, మీరు ఐక్యరాజ్యసమితిలో  ప్రస్తుత ప్రభుత్వంకు అనుకూలంగా మీ గొంతు (గాత్రం)తో అరుస్తూ ఉంటారు?” నిలదీశారు.

“గులాబీ తోటను అలంకరిస్తుంది, లిల్లీ కూడా అలానే ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా తాము చాలా అందంగా ఉంటారనే ఆలోచనతో ఉంటారు. తోట సంక్షోభంలో పడినప్పుడు, తోటను కాపాడుకోవాలనేది రహస్యమేమీ కాదు. దాని అందం ఒకటిగా ఉంది. నేను ఈ రోజు ఉద్యానవనాన్ని రక్షించడానికి వచ్చాను. దీనిని భారత ప్రజాస్వామ్యం అంటారు.” అంటూ వాజపేయి ధీటుగా సమాధానం ఇచ్చారు.

ఫలితంగా వచ్చిన చరిత్ర మనందరికీ తెలిసిందే. అమెరికా 270 ప్రఖ్యాత ప్యాటన్ ట్యాంకులను పాకిస్థాన్‌కు పంపింది. ఈ ట్యాంకులు ప్రత్యేకమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారు. వాటిని నాశనం చేయడం సాధ్యం కాదంటూ నిరూపించడానికి వారు ప్రపంచ మీడియాను పిలిచారు. ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశానికి ఎవరూ సహాయం చేయకూడదని పరోక్షంగా ప్రపంచ దేశాలకు హెచ్చరిక సంకేతంను అమెరికా పంపింది.

అమెరికా ఇక్కడితో ఆగలేదు. భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న ఏకైక అమెరికా కంపెనీ బర్మా-షెల్‌ను ఆపేయాలని సూచించింది. ఇకపై భారత్‌తో వ్యవహరించడం మానేయాలని అమెరికా వారికి గట్టిగా చెప్పింది. ఆ తర్వాత భారతదేశ చరిత్ర తిరిగి పోరాడడం మాత్రమే. చురుకైన దౌత్యంతో ఉక్రెయిన్ నుండి చమురు వచ్చేలా చేసుకోగలిగాము.


థార్ ఎడారిలోని 270 ప్యాటన్ ట్యాంకుల్లో ఎక్కువ భాగాన్ని కేవలం ఒక రోజులో మాత్రమే యుద్ధంలో మన సేనలు ధ్వంసం చేశాయి. ధ్వంసమైన ట్యాంకులను ట్రాఫిక్ క్రాసింగ్‌లలో ప్రదర్శించడానికి భారతదేశంలోకి తీసుకువచ్చారు. రాజస్థాన్‌లోని వేడి ఎడారులు ఇప్పటికీ అమెరికా అహంకారానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.
 
తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ జనాభాపై పాకిస్తాన్ నిర్వహిస్తున్న మారణహోమాన్ని అంతం చేయడానికి ఈ యుద్ధంలో భారతదేశం, పాకిస్తాన్‌లకు చెందిన 3,800 మంది సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారు. ఈ యుద్ధం బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంగా మారింది.  ఇది సాంప్రదాయకంగా ఆధిపత్యం వహించే పశ్చిమ పాకిస్థానీయులు, మెజారిటీ తూర్పు పాకిస్థానీయుల మధ్య జరిగిన సంఘర్షణ.

ముఖ్యంగా మైనారిటీ హిందూ జనాభాను లక్ష్యంగా చేసుకుని తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ జనాభాపై పాకిస్తాన్ నిర్వహించిన విస్తృత మారణహోమం తర్వాత అత్యాచారం, హింసలు, హత్యలు, సంఘర్షణలు  దాదాపు తొమ్మిది మిలియన్ల శరణార్థులను భారతదేశంలోకి నెట్టింది.

 

మారణహోమం జనరల్ తిక్కా ఖాన్‌కు ‘బచర్ ఆఫ్ బెంగాల్’ అనే మారుపేరు తెచ్చిపెట్టింది. ఈ సమయంలోనే, నాటి ప్రధాని ఇందిరా గాంధీ కేవలం శరణార్థి శిబిరాలకు వెళ్లిన వారికి ఆశ్రయం ఇవ్వడం కంటే మారణహోమాన్ని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు.

 

డిసెంబర్ 3న, సరిహద్దుకు 480 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆగ్రాతో సహా వాయువ్య భారతదేశంలోని 11 ఎయిర్‌ఫీల్డ్‌లపై పాకిస్తాన్ వైమానిక దళం ముందస్తు దాడిని ప్రారంభించడంతో యుద్ధం ప్రారంభమైంది. వెంటనే భారత సైన్యం పశ్చిమంలో పాకిస్థాన్ సైన్యం కదలికలకు త్వరితగతిన స్పందించింది.  దాదాపు 15,010 కిలోమీటర్ల పాకిస్థాన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. ఈ యుద్ధం పాకిస్తాన్ జనాభాలో సగానికి పైగా, దాదాపు మూడింట ఒక వంతు సైన్యాన్ని నిర్బంధించింది

ఆ తర్వాత 13 రోజుల పాటు సాగిన యుద్ధం 93,000 మంది పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను పట్టుకోవడంలో ముగిసింది. ముజిబుర్ రెహమాన్ లాహోర్ జైలు నుండి విడుదలయ్యారు.  మార్చి, 1972 లో ప్రధాని ఇందిరా గాంధీ భారత పార్లమెంటులో బంగ్లాదేశ్‌ను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. 
 
ఈ సంఘటనలు భారత దేశ చరిత్ర గతిని మార్చేశాయి. ఆ తర్వాత మన సొంత చమురు కంపెనీ ఇండియన్ ఆయిల్ ఉనికి లోకి వచ్చింది. ప్రపంచ దృష్టిలో మొదటిసారిగా భారత్ సైనికంగా శక్తివంతమైన దేశంగా గుర్తింపు పొందింది. ఈ సమయంలోనే అలీన ఉద్యమానికి భారత్ నేతృత్వం వహించడం ప్రారంభించింది. 
.