పిల్లలపై లైంగిక నేరాల్లో మౌనం వద్దు

పిల్లలపై లైంగిక నేరాల్లో మౌనం వద్దని, నిశ్శబ్ద సంస్కృతి నుంచి బైటకు రావాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపిచ్చారు. పోస్కో చట్టంపై ఢిల్లీలో రెండు రోజుల పాటు జరుగుతున్న సదస్సులో శనివారం పాల్గొంటూ నిశ్శబ్ద సంస్కృతి ఉన్నందువల్ల పిల్లలపై లైంగిక వేధింపులు రహస్య సమస్యగా మిగిలిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
నేరానికి పాల్పడిన వ్యక్తి కుటుంబసభ్యుడైనా ఫిర్యాదు చేసేలా కుటుంబాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలని జస్టిస్ చంద్రచూడ్‌ సూచించారు. నేర న్యాయవ్యవస్థ కొన్ని సార్లు బాధితులను మానసిక క్షోభకు గురిచేసేలా వ్యవహరించడం దురదృష్టకరమని, దీనిని నిరోధించేందుకు కార్యనిర్వాహక వర్గం న్యాయవ్యవస్థతో కలిసి పనిచేయాలని కోరారు.
 
‘‘పిల్లలపై లైంగిక వేధింపుల వల్ల దీర్ఘకాలిక ఇబ్బందులు, వేధింపుల నివారణ, వాటిని సకాలంలో గుర్తించడం, చట్టం ద్వారా ఎదుర్కొనేందుకు ప్రభుత్వంతో పాటు ఇతర భాగస్వాములకు అవగాహన కల్పించడం ముఖ్యం. సురక్షిత, అసురక్షిత స్పర్శ మధ్య తేడాను పిల్లలకు తప్పక తెలియజేయాలి” అని స్పష్టం చేశారు. 
 
గతంలో దీనిని మంచి స్పర్శ, చెడు స్పర్శగా సూచించినప్పటికీ బాలల హక్కుల సంఘాలు సురక్షిత, అసురక్షిత పదాలను వాడాలని ఆయన కోరారు. ఎందుకంటే మంచి, చెడు అనే పదాలు నైతిక ప్రభావాలను కలిగి ఉంటాయని,  ఇది వారిని ఫిర్యాదు చేయకుండా నిరోధించవచ్చని జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు.
 
అలాగే, పోక్సో చట్టం కింద నమోదు చేసే కేసుల్లో నిందితుల వయసును దృష్టిలో ఉంచుకోవాలని చట్టసభలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘పోక్సో ప్రకారం మైనర్ల సమ్మతి ఉందా? లేదా? అనే దానితో సంబంధం లేకుండా 18 ఏళ్లలోపు వారిపై జరిగే అన్ని లైంగిక చర్యలనూ నేరంగా పరిగణిస్తుందని మనకు తెలుసని గుర్తు చేశారు. 
అయితే బాలికల సమ్మతితో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్న సందర్భాలు కోర్టు దృష్టికి వచ్చినట్టు తెలిపారు. అయినప్పటికీ భాగస్వామిపై పోక్సో చట్టం కింద కేసులు పెడుతుండడంతో న్యాయమూర్తులకు క్లిష్టమైన ప్రశ్నలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దీన్ని శాసన వ్యవస్థ పరిశీలించాల్సి ఉందని ఆయన సూచించారు. 
 
 ఎందుకంటే 18 ఏళ్ల లోపు వారిలో సమ్మతి లేదని చట్టం ఊహ అంటూ తాను న్యాయమూర్తిగా ఉన్న సమయంలో ఈ వర్గం వారిలోని కేసులు జడ్జిలకు కష్టమైన ప్రశ్నలు వేస్తాయని గమనించాన్నట్లు తెలిపారు. మనం రోజూ న్యాయస్థానాల్లో ఇలాంటి కేసులు ఎక్కువగా చూస్తున్నందున దీనిని ఇక్కడితో ముగిస్తున్నట్లు చెప్పారు.

కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. విచారణ ప్రక్రియను వేగవంతం చేసి, ప్రాణాలతో బయటపడిన బాధితులకు పరిహారం అందజేయడంపై దృష్టి సారించాలని కోరారు. పిల్లలకు పరిష్కారాలను త్వరితగతిన చేపట్టేందుకు మౌలిక సదుపాయాల పరంగా ఏం చేయాలనేది న్యాయమూర్తుల నుంచి ఆమె సూచనలను కోరారు.
 
‘‘ప్రతి నేరారోపణకు మూడు విధాలుగా నిర్దోషిత్వంగా నిరూపించుకునే వీలుంది.. పోక్సో కేసులలో 56% లైంగిక వేధింపుల నేరాలకు.. 25.59% కేసులకు తీవ్రమైన లైంగిక దాడులకు సంబంధించినవి.. అంటే వాటిని నిరోధించే బలమైన యంత్రాంగం అవసరం ఉంది’’ అని ఆమె పేర్కొన్నారు.