ఇషాన్‌ డబుల్‌ సెంచరీ, కోహ్లీ సెంచరీలతో బంగ్లా చిత్తు

తొలి రెండు వన్డేల్లో ఓడి సిరీస్‌ను కోల్పోయిన టీమిండియా మూడో వన్డేలో ఏకంగా 227 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వికెట్‌ను త్వరగా కోల్పోయింది. 
 
ఆ తర్వాత యువ ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌(210) విరోచితంగా బ్యాటింగ్‌ చేసి కెరీర్‌లో తొలి డబుల్‌ సెంచరీ సాధించాడు. మరో ఎండ్‌లో కోహ్లీ(113) కూడా సెంచరీతో కదం తొక్కాడు. వీరిద్దరూ కలిసి 2వ వికెట్‌కు ఏకంగా 290 పరుగులు జతచేశారు. కోహ్లీకి వన్డేల్లో ఇది 44వ సెంచరీ కాగా, అన్ని ఫార్మాట్లలో కలిపి 72వ శతకం. ఇక ఇషాన్‌ 131బంతుల్లో 210 పరుగులు చేసి పలు రికార్డులను నెలకొల్పాడు. 
మరోవైపు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. బంగ్లాదేశ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న కోహ్లి 91 బంతుల్లోనే 11 ఫోర్లు, రెండు సిక్సర్లతో 113 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు బ్యాట్‌ ఝుళిపించడంతో టీమిండియా 50 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 409పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేసింది. బంగ్లా బౌలర్లలో తస్కిన్‌ అహ్మద్‌, ఇబాదత్‌ హొస్సేన్‌, షకిబుల్‌ హసన్‌కు రెండేసి, ముస్తాఫిజుర్‌, మెహదీకి చెరో వికెట్‌ లభించాయి.
 
భారీ ఛేదనతో నాలుగో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లాకు అక్షర్‌ పటేల్‌ తొలి బ్రేక్‌ ఇచ్చాడు. కెప్టెన్‌ లిట్టన్‌ దాస్‌(29)ను సిరాజ్‌ ఔట్‌ చేయగా, మిడిలార్డర్‌ బ్యాటర్‌ షకిబుల్‌, ముష్ఫికర్‌ రహీంలు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, షకిబుల్‌(43)కు మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లభించలేదు. భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీయడంతో బంగ్లా ఒత్తిడిలో పడింది. 
 
శార్థూల్‌ ఠాకూర్‌ కీలకమైన మెహిదీ హసన్‌ వికెట్‌ తీయడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. భారత బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌కు మూడు, అక్షర్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌కు రెండేసి, సిరాజ్‌, కుల్దీప్‌, వాషింగ్టన్‌ సుందర్‌లకు ఒక్కో వికెట్‌ దక్కాయి.  దీంతో మూడు వన్డేల సిరీస్‌ను బంగ్లాదేశ్‌ జట్టు 2-1తో చేజిక్కించుకోగా  ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇషాన్‌ కిషన్‌కు, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ మెహిదీ హసన్‌కు లభించాయి. ఇరు జట్ల మధ్య రెండు టెస్ట్‌ మ్యాచ్‌ల సిరీస్‌ 14నుంచి ప్రారంభం కానుంది.
 ఇషాన్‌ పలు అంతర్జాతీయ రికార్డులు 
 
పరుగుల వరద పారించి వేగవంతమైన డబుల్‌ సెంచరీతో పాటు ఇషాన్‌ కిషన్‌ పలు అంతర్జాతీయ రికార్డులు నెలకొల్పాడు. కెరీర్‌లో 10వ వన్డే ఆడుతున్న 24ఏళ్ల ఇషాన్‌ బంగ్లాపై కేవలం 131 బంతుల్లో 24 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 210 పరుగులు చేశాడు.  ఇదే క్రమంలో డబుల్‌ సెంచరీని 126 బంతుల్లోనే పూర్తిచేసి వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ (138 బంతులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే భారత్‌ తరఫున డబుల్‌ సెంచరీ కొట్టిన 4వ బ్యాటర్‌గా, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో 9వ క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
భారత్‌ తరఫున నలుగురు బ్యాటర్లు ఆరు ద్విశతకాలు కొట్టడం విశేషం. ఇందులో టీమిండియా సారథి రోహిత్‌ శర్మ ఏకంగా మూడుసార్లు (264, 209, 208 నాటౌట్‌) డబుల్‌ సెంచరీలు చేయగా.. వీరేంద్ర సెహ్వాగ్‌ (219), సచిన్‌ టెండూల్కర్‌ (200 నాటౌట్‌) డబుల్‌ సెంచరీ చేశారు.  అలాగే న్యూజిలాండ్‌ బ్యాటర్‌ మార్టిన్‌ గప్తిల్‌ (237 నాటౌట్‌), విండీస్‌కు చెందిన క్రిస్‌ గేల్‌ (215 పరుగులు), పాకిస్తాన్‌కు చెందిన ఫఖర్‌ జమాన్‌ 210 (నాటౌట్‌) అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్‌ సెంచరీలు చేశారు.