4 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో సమాధానం చెప్పాలి 

గత 4 ఏళ్లలో నోటిఫికేషన్లు ఇవ్వడమే తప్ప ఒక్క ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయడం కేసీఆర్ కు చాతకాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ యువత చేసిన పాపమేంటని ప్రశ్నించారు. రుణమాఫీ అమలు చేయకుండా, సబ్సిడీలన్నీ బంద్ చేసి రైతుల ఉసురు తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. 
 
  5వ విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా కోరుట్ల బస్టాండ్ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ  లక్ష కోట్ల దొంగ సారా దందా, క్యాసినో దందాలతో కేసీఆర్ బిడ్డ రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు.  ‘‘దొంగ సారా, క్యాసినో దందా స్కాంలు చేసిన కేసీఆర్ బిడ్డను ఎందుకు అరెస్ట్ చేయకూడదు? ఆమె ఏమైనా స్వాతంత్ర్య సమరయోధురాలా? చాకలి ఐలమ్మ వారసురాలా?… ఆమెను అరెస్ట్ చేస్తే ప్రజలెందుకు నిరసన తెలపాలి? ఎందుకు విధ్వంసం స్రుష్టించాలి’’అని ప్రశ్నించారు.
 
టీఆర్ఎస్ నుండి తెలంగాణను వేరుచేసిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందేనని సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో కుల వ్రుత్తులన్నీ ధ్వంసమయ్యాయని, ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని ధ్వజమెత్తారు.  కరోనా సమయంలో గల్ఫ్ నుండి వచ్చిన హిందూ యువకులను తరలించి ఒక్కొక్కరి దగ్గర 15 నుండి 20 వేల రూపాయలు వసూలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గం వారికి మాత్రం ఉచితంగా బాదం, పిస్తాలు పెట్టి పోషించిందని పేర్కొన్నారు. 
 
టీఆర్ఎస్ లో ఎంతో మంది ఎమ్మెల్యేలకు సీఎం అయ్యే అర్హత ఉన్నప్పటికీ  కేసీఆర్ మాత్రం తన కొడుకును సీఎం చేసేందుకు సిద్ధమై వారందరనీ అవమానిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.  ‘‘ఎమ్మెల్యేల్లారా…. మీలో తెలంగాణ రక్తం ప్రవహిస్తే… మాతో కలిసి రండి. ప్రగతి భవన్ గడీలు బద్దలు కొడదాం….’’ పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే రజకార్లను తరిమి తరమి కొడతామని స్పష్టం చేశారు. 
 
ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యం అందించడంతోపాటు ఇల్లులేని పేదలందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు పంట నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు.