తమిళనాడును వణికిస్తున్న‘మాండస్‌’ తుఫాను

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. మాండోస్ తుపాన్ రూంపంలో దక్షిణాదిన పలు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ‘మాండస్‌’ తుఫాను తమిళనాడును వణికిస్తున్నది.  శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మహాబలిపురం వద్ద తీరం దాటింది. శనివారం తెల్లవారుజాము నాటికి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారి వాయవ్యంగా పయనిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.
 
ముందు జాగ్రత్తగా ప్రజలను అప్రమత్తం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది.రాష్ట్రంలోని 12 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. పది జిల్లాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను మోహరించారు. అటు పుదుచ్చేరి ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మాండస్‌ నేపథ్యంలో చెన్నై ఎయిర్‌పోర్టు అధికారులు 15 విమాన సర్వీసులను రద్దు చేశారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో రాలయసీమ దక్షిణ కోస్తా జిల్లాలలో ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. తీర ప్రాంతాల్లో ఉన్న జాలర్ల కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.  తుఫాన్‌ ప్రభావంతో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. 
 
చెన్నై పరిసరాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శనివారం కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అతిభారీగా, నెల్లూరు, తిరుపతి, వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 
 
11న రాయలసీమ, ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో కృష్ణపట్నం, నిజాంపట్నం, మచిలీపట్నంలో మూడో నంబరు, కాకినాడ, గంగవరం, విశాఖ ఓడరేవుల్లో రెండో నంబరు భద్రతా సూచిక ఎగురవేసినట్టు విశాఖ తుఫాన్‌ హెచ్చరిక కేంద్రం తెలిపింది.
 
తిరుమలలో శుక్రవారం ఎడతెరిపిలేని వర్షం కురిసింది. శుక్రవారం వేకువజాము నుంచే చిరుజల్లులతో కూడిన వర్షం మొదలైంది. ఈదురుగాలులతో పాటు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. కాలినడకన తిరుమలకు వచ్చే యాత్రికులు కూడా వర్షంతో ఇబ్బందులు పడ్డారు.
 
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలోని ఆదాని పోర్టులో 6వ నంబరు హెచ్చరిక ఎగురవేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో తుఫాన్‌ కారణంగా వరి పంట మాసూళ్లకు అవరోధం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
కాకినాడ జిల్లా ఉప్పాడలో అలలు భారీస్థాయిలో ఎగసిపడుతున్నాయి. రెండుచోట్ల వంతెనల కింద నుంచి కెరటాలు రోడ్డుకు అవతలవైపు దూసుకువెళ్లాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో కాకినాడ యాంకరేజ్‌ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి.
రాగల 24గంటల్లో తుపాన్‌ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. తమిళనాడుతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు.తిరుమలలో వర్షం కుండపోతగా పడుతోంది. చిత్తూరు, కడప ,పుట్టపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు భారీ వర్సాలు కురుస్తున్నాయి. దక్షిణ తెలంగాణలో కూడా పలు ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.