తెలంగాణకు కేసీఆర్ పీడ పోయింది

టీఆర్ఎస్ రద్దుతో తెలంగాణకు కేసీఆర్ పీడ పోయిందని, పార్టీ పేరులో తెలంగాణను తీసేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో మాట్లాడుతూ ఇక్కడ చెల్లని రూపాయి అక్కడ చెల్లుతుందా అని ప్రశ్నించారు.
దేశానికి వ్యతిరేకంగా ఉండే వారంతా దొంగల ముఠాలా బయల్దేరారని ఆరోపించారు. దేశంలో పార్టీ పెట్టినప్పుడు.. రాష్ట్రంలో ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు.  రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఎన్ని ఇండ్లు ఇచ్చింది..? డబుల్ బెడ్రూం ఇండ్లు ఎన్ని ఇచ్చారో కేసీఆర్ లెక్క చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏం  నెరవేర్చారో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని స్పష్టం చేశారు.
ఇటీవల పంజాబ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసినవ్.. ఇక దేశాన్ని మోసం చేయాలనుకుంటున్నవా అంటూ మండిపడ్డారు. మిషన్ భగీరథ పైపులు కేసీఆర్ ఫ్యాక్టరీ నుంచే వస్తాయని అంటూ  రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రాగానే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు ప్రత్యేక పథకం తీసుకొస్తామని సంజయ్ ప్రకటించారు.
తెలంగాణలో రంగు రంగుల జెండాలు పోవాలని.. డబుల్ ఇంజన్ సర్కార్, కమలం వికసించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే అందరికి ఉచిత విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. నిలువ నీడ లేని పేదలకు ఇళ్ళు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో రైతులను మోసం చేస్తున్నారని..ఎరువులకు కేంద్రం సబ్సిడీ ఇస్తోందని పేర్కొన్నారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించిన ఘనత మోదీదని చెబుతూ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మీరు తెరిపిస్తారా? మేము తెరిపించాలా.? అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేశారు. కొండగట్టు ప్రమాద బాధితులకు ఇప్పటివరకూ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని సంజయ్ ఆరోపించారు.
 రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే గత ప్రభుత్వాలు అమలు చేసిన మంచి సంక్షేమ పథకాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ముప్పై గ్రామాలకు సరిపోయేంత కరెంట్ ను ఫామ్ హౌస్ లో కేసీఆర్ వాడుతున్నారని విమర్శించారు. మెట్రో పక్కన తన భూములకు ధరలు రావాలని..కేసీఆర్ మళ్లీ మెట్రో కావాలని అంటున్నారని సంజయ్ ఆరోపించారు.
పునరావాస కేంద్రంగా ‘బీఆర్ఎస్’
దేశ రాజకీయాలంటూ కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… ప్రజలు పట్టించుకోరని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ స్పష్టం చేశారు.  తెలంగాణలోనే ఏమీ చేయని వ్యక్తి ఇక జాతీయ రాజకీయాల్లో ఏం చేస్తాడని ముఖ్యమంత్రి టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చడంపై ఎద్దేవా చేశారు. 
 
‘టీఆర్ఎస్’ ను ఎప్పుడైతే… ‘బీఆర్ఎస్’ అని ప్రకటించారో… అప్పుడే టి ఆర్ ఎస్ అస్తిత్వం చచ్చిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ ఎక్కడ ఉన్నా  దోచుకోవడం, దాచుకోవడం తప్ప, ప్రజలకు ఉపయోగమేమీ ఉండదని ధ్వజమెత్తారు. కేవలం తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే ‘బీఆర్ఎస్’ పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. 
 
ఇక ‘బీఆర్ఎస్’ పార్టీ, దేశంలోని అవుట్డేటెడ్ పార్టీలు, కనుమరుగైన రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా మారుతుందే తప్ప, ఆ పార్టీ సాధించెడిది ఏమీ లేదని ఆయన వెల్లడించారు. ఎంతసేపు ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ అండ్ బ్యాచ్ కు … గుజరాత్ మోడల్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమై ఉంటుందని దుయ్యబట్టారు. 
 
ఇప్పటికీ అర్థం కాకుంటే టిఆర్ఎస్ నేతలు, కళ్ళుండి చూడలేని కబోదులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఎన్వి సుభాష్ వెల్లడించారు. గుజరాత్ లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కేసీఆర్ సహా ప్రత్యర్ధులు డబ్బు సంచులను పంపినా, రికార్డ్ విక్టరీతో అక్కడి ప్రజలు బిజెపిని గెలిపించి, వీళ్ళ చెంప చెల్లు మనిపించారని గుర్తు చేశారు. 
 
 ఇప్పటికైనా ఈ దొంగల ముఠాకు బుద్ధి వచ్చి, తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. దేశం కోసం, ధర్మం కోసం రోజులో 18 గంటలు పనిచేస్తున్న ప్రధాని మోదీ మేనియా ముందు, మీ పప్పులు ఉడకవని, ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని కేసీఆర్ అండ్ బ్యాచ్ ను సుభాష్ హెచ్చరించారు. 
 
మీరు ‘టీఆర్ఎస్’ ను ‘బీఆర్ఎస్’ చేసుకున్నా… ఏమి చేసుకున్నా… మీకు ‘వీఆర్ఎస్’ తప్పదని… లిక్కర్ స్కామ్లలో, అవినీతి కేసులలో… మీరు జైలుకు పోక తప్పదని ఆయన జోష్యం చెప్పారు.