2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పని చేయాలి

ఇటీవల నూతనంగా నియమించిన పార్లమెంట్ నియోజకవర్గ విస్తారక్ లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమావేశమయ్యారు. శుక్రవారం  సాయంత్రం మెట్ పల్లిలోని ప్రజా సంగ్రామ యాత్ర లంచ్ శిబిరం వద్ద జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ పోలింగ్ బూత్ మొదలు పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టాల్సిన కార్యక్రమాలతోపాటు మిషన్-2023 పేరిట రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని నిర్దేశించారు. పార్లమెంట్ నియోజకవర్గాల్లోనే పూర్తిగా మకాం వేసి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు పూర్తిస్థాయిలో పార్టీ సంస్థాగత బలోపేతంతోపాటు బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని కోరారు. 
కాగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో అత్యవసరంగా సమావేశమై  5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో ఈనెల 15న కరీంనగర్ లో నిర్వహించబోయే భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా రానున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లు, జన సమీకరణతోపాటు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఈ సందర్భంగా గత బహిరంగ సభలను తలదన్నేలా కరీంనగర్ లో నిర్వహించే బహిరంగ సభ దిగ్విజయవంతమయ్యేలా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాన కార్యదర్శులను ఆదేశించారు.  రాష్ట్రంలోని అన్ని పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల నుండి మొదలు రాష్ట్ర స్థాయి నాయకులు, వివిధ మోర్చాల కార్యకర్తలు, నాయకులందరినీ కరీంనగర్ బహిరంగ సభకు తీసుకురావాలని చెప్పారు.  జిల్లాల వారీగా జన సమీకరణ, వాహనాల సేకరణ వంటి అంశాలపైనా లోతుగా చర్చించారు.
సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళతారనే సంకేతాలొస్తున్నాయని చెబుతూ ఈ క్రమంలో 5వ విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు బహిరంగ సభ కరీంనగర్ జిల్లాలో జరగబోతోందని తెలిపారు. ఈ 5 రోజులు పూర్తిగా సభ సక్సెస్ పైనే దృష్టి పెట్టాలని కోరారు. ప్రతిచోట సభ గురించే చర్చ జరిగేలా ప్రచారం చేయండని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు.