తెలంగాణ జోలికి రావొద్దు.. సజ్జలపై అరవింద్ ఆగ్రహం 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను మళ్లీ కలిపే అవకాశం ఉంటే అందుకు ప్రయత్నాలు చేస్తామంటూ వైఎస్సార్సీపీ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతగా మళ్లీ కలవాలనుకుంటే పాత మద్రాస్ ప్రావిన్సులో భాగమైన తమిళనాడుతో కలవండి అంటూ హితవు చెప్పారు. అంతే తప్ప తెలంగాణ జోలికి రావొద్దని హెచ్చరించారు. 
 
ఇలాంటి వ్యక్తిని ఎందుకు సలహాదారుడిగా పెట్టుకున్నారంటూ ఆయన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. తక్షణమే జగన్ తన సలహాదారుణ్ణి మార్చుకోవాలని సూచించారు. కాగా, ఉపాధి హామీ పథకం నిధులను కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మళ్లించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి నోటీసులు అందుకోవడం సిగ్గుచేటని ఎంపీ అరవింద్ విమర్శించారు.
మద్యం వ్యాపారం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు కానీ పేదలకు ఇచ్చేందుకు మాత్రం నిధుల్లేవని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లైన్‌కు శంఖుస్థాపన చేయడంపై స్పందిస్తూ  2013లోనే మెట్రో లైన్ నిర్మిస్తానని చెప్పి ఇప్పుడు శంఖుస్థాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మరోవైపు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించిందని, ఇందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరించిన పేదల అనుకూల విధానాలే కారణమని అరవింద్ సూత్రీకరించారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని, కానీ ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించారని చెప్పారు.
అలాగే ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మిషన్ భగీరథ’ ఇప్పటికీ పూర్తికాలేదని, కానీ కేంద్ర ప్రభుత్వం ‘హర్ ఘర్ జల్’ పథకం ద్వారా దేశంలో 50 శాతం పేదలకు నీటిని అందజేస్తోందని పేర్కొన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో 90 శాతం జనాభాకు తాగునీరు పైప్ లైన్ల ద్వారా ఇంటికి చేరుతుందని తెలిపారు.
పేదలకు జన్‌ధన్ ఖాతాల ద్వారా సంక్షేమ ఫలాలు నేరుగా అందజేస్తున్నామని, తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం లిక్కర్ కుంభకోణం, ఫీనిక్స్ కుంభకోణంతో తన కుటుంబ సంక్షేమం కోసం చూసుకుంటున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ 24 దేశాలకు వ్యాక్సిన్ పంపితే కేసీఆర్ రూ. 24 వేల కోట్ల అవినీతి సొమ్ము విదేశాల్లో దాచుకున్నారని ఆరోపించారు.  మరో 9 నెలల్లో కేసీఆర్ గద్దె దిగడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.