అనేక రంగాల్లో వివక్షతకు గురవుతున్న వికలాంగులు

వికలాంగులకు సామజిక, న్యాయపర సంరక్షణాలు కలిపిస్తూ సమగ్రమైన చట్టం రూపొందించినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు విధానపరమైన నిర్ణయాలు తీసుకొంటున్నా వాటి అమలు సక్రమంగా లేకపోవడంతో వికలాంగులు అనేక రంగాలలో నిత్యం వివక్షకు గురవుతున్నారని అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా `సోషల్ కాజ్’ జరిపిన సదస్సులో పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేశారు. 
 
ఉద్యోగ నీయమాకాలలో, ప్రమోషన్లలో అత్యున్నత స్థానాలలో సహితం వివక్షత ఎదురవుతున్నదని ఐసిఎంఆర్- జాతీయ పౌష్టికాహార సంస్థకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త డా. జి భాను ప్రకాష్ రెడ్డి తెలిపారు. “భారతదేశంలో వికలాంగుల మానవ హక్కులు: విధానాలు & పద్ధతులు”పై రౌండ్ టేబుల్ చర్చలో  పాల్గొంటూ  ప్రభుత్వ భవనాలు అన్ని వికలాంగులకు స్నేహపూర్వకంగా ఉండే విధంగా విధాన ప్రకటనను చేసి శతాబ్దం దాటినప్పటికీ ఆచరణలో నోచుకోవడం లేదని తెలిపారు.
 
ప్రైవేట్ సంస్థలలో సహితం ఆ విధమైన భవనాలు ఉండాలని చట్టం స్పష్టం చేస్తున్నా చాలా మందికి అవగాహన  లేకపోవడం, వికలాంగులకు అనుకూలమైన డిజైన్ ల పట్ల సానుకూలత లేకపోవడంతో ఆచారంలో ప్రయోజనం ఉండటం లేదని చెప్పారు. అయితే ఈ విషయంలో వికలాంగులు సహితం చొరవ తీసుకుని, తాము సందర్శించిన కార్యాలయాలు, ప్రజయోపయోగ ప్రదేశాలలో అటువంటి లోటుపాట్ల గురించి సంబంధీకుల దృష్టికి తీసుకు వస్తే కొంతమేరకు ప్రయోజనం ఉండవచ్చని తెలిపారు. 
 
వికలాంగుల కోసం భవనాలలో ఏర్పాటు చేస్తున్న రాంప్ లు వారికి సానుకూలంగా ఉండటం లేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.  వికలాంగుల ఆరోగ్య సమస్యలు అంటే అనారోగ్యం మాత్రమే కాదని, సామాజిక, మానసిక సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని డా. రెడ్డి చెప్పారు. 
 
హక్కుల ఉద్యమాలలో కూడా వికలాంగుల హక్కుల ప్రస్తావనకు రావడం లేదని  వికలాంగుల సంస్థల నెట్ వర్క్ అధ్యక్షుడు ఎం శ్రీనివాసులు విచారం వ్యక్తం చేశారు. వికలాంగులకు సంబంధించిన ప్రభుత్వ గణాంకాలు లోపభూయిష్టంగా ఉన్నాయని అంటూ, ప్రభుత్వం చెప్పిన సంఖ్యకన్నా రెట్టింపు సంఖ్యలో ఉన్నారని ఆయన తెలిపారు. పైగా, కేవలం అంగవైకల్యం ఉన్న వ్యక్తులనే కాకుండా, వారి కారణంగా వివక్షతలకు, పలు అసౌకర్యాలకు గురవుతున్న వారి కుటుంభం సభ్యులను కూడా పరిగణలోకి తీసుకోవలసిందే స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో వికలాంగులకు సానుకూలంగా ఉండే విధంగా పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేయడం గురించి ఎన్నికల కమిషన్ కు అవగాహన లేకపోవడంతో, ఇటీవల జరిగిన మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా తాము హైకోర్టు ద్వారా జోక్యం చేసుకున్నామని ఆయన తెలిపారు. సానుకూల వాతావరణం, ఆరోగ్యం, విద్య వంటి అన్ని విధాలుగా వికలాంగులు హక్కుల ఉల్లంఘనలకు గురవుతున్నారని అంటూ పాలకులలో రాజకీయ సంసిద్ధత లేకపోవడమే కారణం అని ఆయన ఆరోపించారు.
భారతదేశంలో వికలాంగులకు, వారి పునరావాసానికి సానుకూలంగా ఉండే ఒక గ్రామం కూడా లేదని శ్రీనివాసులు ఆందోళన వ్యక్తం చేశారు. వారి సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక జిఓ లను తీసుకు వస్తున్నా, అవి అమలుకు నోచుకోవడం లేదని చెప్పారు.
వికలాంగులకు సానుభూతి అవసరం లేదని, వారికి తగు అవకాశాలు కల్పించడం ముఖ్యమని కస్తూరిబా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ ప్రతినిధి పి పద్మావతి స్పష్టం చేశారు. వికలాంగులకు సారత్ర్వక సానుకూల వాతావరణం కల్పించడం కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున “సుగమ్య భారత్ అభియాన్” ప్రారంభించినా అమలుకు నోచుకోవడం లేదని ఆమె విచారం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ రంగంలో వికలాంగులకు రేజర్వేషన్లను మోదీ ప్రభుత్వం 3 నుండి 4 శాతంకు పెంచిందని, అయితే అమలు మాత్రం సరిగ్గా లేదని ఆమె చెప్పారు. కాగా, ప్రైవేట్ రంగంలో కూడా వారికి రిజర్వేషన్ల కల్పనకు ప్రభుత్వంపై వత్తిడి తీసుకు రావాలని ఆమె సూచించారు. కేంద్రం వికలాంగులకు విశేషమైన కార్యక్రమాలు రూపొందించడమే కాకుండా, వాటి అమలుకు అవసరమైన నిధులను సహితం బడ్జెట్ లో కేటాయించాలని పద్మావతి స్పష్టం చేశారు.
హక్కులతో పాటు బాధ్యతల గురించి కూడా అవగాహనా కల్పించాలని హెలెన్ కెల్లెర్స్ సంస్థ వ్యవస్థాపక చైర్మన్ ప్రొఫెసర్ పఠాన్ ఉమర్ ఖాన్ సూచించారు. అన్ని వైకల్యంలలో వినికిడి వైకల్యం ఎక్కువ ప్రమాదకరమైనదని చెబుతూ తెలంగాణలోనే అటువంటి వారు 5 నుండి 16 ఏళ్ళ మధ్య వయస్సులో 50,000 మందివరకు ఉన్నారని చెప్పారు. అయితే వారిలో 20,000 మంది మాత్రమే పాఠశాలలకు వస్తున్నారని, వారికి తగిన సదుపాయాలున్న పాఠశాలలు అందుబాటులో లేవని తెలిపారు. తెలంగాణాలో మేధో వికలాంగులకు ఒక పాఠశాల కూడా లేదని ఆయన పేర్కొన్నారు.
వికలాంగులపై అవగాహన పాఠశాలల నుండే ప్రారంభం కావాలని ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. జె లలిత సూచించారు. బి. ఎడ్ కోర్సు చదువుతున్న చాలామంది ఉపాధ్యాయులకు వికలాంగుల గురించిన అవగాహన లేదని చెబుతూ వికలాంగుల  విద్యాబోధనకు సంబంధించి గల సదుపాయాల గురించి కూడా చాలామందికి తెలియదని ఆమె చెప్పారు.
 కార్యక్రమాల అమలులో కేంద్ర రాష్ట్రాల మధ్య అర్ధవంతమైన సంబంధం ఉండటం లేదని భారత పునరావాస మండలి జోనల్ కన్వీనర్  కాసినాధ్ లక్కరాజు విచారం వ్యక్తం చేశారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకొంటున్నా అమలులో  తీవ్ర కాలయాపన జరుగుతూ ప్రయోగాజనం లేని పరిస్థితులు నెలకొంటున్నాయని చెప్పారు.
తొలుత సోషల్ కాజ్ అధ్యక్షుడు డా. దినేష్ కుమార్ స్వాగతం పలికారు. ఇటీవలనే ఇంటర్నేషనల్ యూనియన్ అఫ్ న్యూట్రిషనల్ సైన్సెస్ ఫెలో గా ఎన్నికైన డా. భాను ప్రకాష్ రెడ్డిని సోషల్ కాజ్ తరపున సుబ్బారావు, ఉదయ్ చౌదరి సత్కరించారు. సోషల్ కాజ్ ఉపాధ్యక్షుడు సిహెచ్ నరేంద్ర అధ్యక్షత వహించారు.