ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదు

బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ పిడి చట్టం కింద అరెస్ట్ చేసి, సుమారు రెండు నెలల పాటు జైలులో ఉంచినా హైకోర్టు తీర్పుతో బైటకు వచ్చిన ఆయనను తెలంగాణ  పోలీసులు వదిలిపెట్టడం లేదు. తాజాగా మంగళ్‌హాట్ పోలీసులు ఆయనపై మరో కేసు నమోదు చేశారు.
హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ఇటీవల ట్విట్టర్‌లో ఆయన ఓ పోస్ట్ పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఇటీవల నోటీసులు జారీ చేశారు. దీనిపై రాజాసింగ్ సింగ్ తరపు న్యాయవాదులు వివరణ ఇవ్వగా.. పోలీసులు ఆ సమాధానంతో సంతృప్తి చెందలేదంటూ హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తూ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టినందుకు మరో కేసు నమోదు చేశారు.
ఈ కేసుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గతంలో బాబ్రీ మసీదు ఘటన సమంయలో ఓవైసీ సోదరులు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని రాజాసింగ్  ప్రశ్నించారు. తన పట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు.
సోషల్ మీడియాలో మహ్మద్ ప్రవక్తను కించపరుస్తూ వీడియో పోస్ట్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టారని ఆరోపిస్తూ రాజాసింగ్‌పై మంగళ్‌హాట్ పోలీసులు పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి ఆగస్టు 22న అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పీడీ యాక్ట్ కేసులో చర్లపల్లి జైల్లో రాజాసింగ్ కొన్ని నెలల పాాటు ఉన్నారు.
అయితే మూడు మాసాల పాటు మీడియాతో మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో కులమతాలకు సంబంధించిన పోస్టులు పెట్టవద్దనే షరతుతో రాజాసింగ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో నవంబర్ 9న జైలు నుంచి రాజాసింగ్ విడుదల అయ్యారు. హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణతో ఇప్పుడు పోలీసులు మరో కేసు నమోదు చేసారు.