మెట్రో నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన కేసీఆర్

గతంలో మెట్రో ప్రాజెక్టే చేపట్టనీయమన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడెట్ల ఎయిర్ పోర్టు వరకు మెట్రో ప్రాజెక్టు చేపడతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ‘‘రక్తం ఏరులై పారినా మెట్రో నిర్మాణం చేపట్టనియ్యం. ఎవ్వరినీ ఒక్క గజం కూడా తిరగనియ్యం” అని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేశారు.
ఇలాంటి హెచ్చరికలతో హైదరాబాద్ లో మెట్రో నిర్మాణానికి అడుగడుగునా ఆటంకాలు సృష్టించిన వ్యక్తికి ఇప్పుడు ఎయిర్ పోర్ట్ మెట్రోకు శంకుస్థాపన చేసే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై కేసీఆర్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు చెప్పారు.
మెట్రో ఫేజ్–2 ప్రాజెక్టుకు రాష్ట్ర సర్కార్ నిధులు విడుదల చేసిన తీరు చూస్తుంటే, ఈ ప్రాజెక్టును పూర్తి కావడానికి కనీసం 65 ఏండ్లు పడుతుందని ఆయన విమర్శించారు. మెట్రో ఫేజ్ –1లో భాగంగా ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా వరకు ఓల్డ్ సిటీ మీదుగా 5.2 కిలోమీటర్ల మేర నిర్మించాల్సిన మెట్రో లైన్ పనులు ఇంత వరకు ఎందుకు ప్రారంభించలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఓల్డ్ సిటీ మెట్రో పనులు ప్రారంభించకుండా, ఎయిర్ పోర్ట్ మెట్రో పనులకు శంకుస్థాపన చేయడానికి సిద్ధమవడం చూస్తుంటే తమ అనధికారిక మిత్రులు ఒవైసీల మాటకు కట్టుబడి ఓల్డ్ సిటీ ప్రజలకు మెట్రోను దూరం చేయాలని ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి ధ్వజమెత్తారు.
‘‘మెట్రో ఫేజ్–1లో భాగంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద దాదాపు రూ.1,500 కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకారం తెలిపింది. ఇప్పటికే దాదాపు రూ.1,200 కోట్లు విడుదల చేసింది. ఓల్డ్ సిటీలో మెట్రో పనులు ప్రారంభిస్తే మిగతా నిధులు కూడా ఇవ్వడానికి  సిద్ధంగా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు” అని కిషన్ రెడ్డి విమర్శించారు. దీనిపై కేసీఆర్ కు గతంలో లేఖలు రాసినప్పటికీ ఎలాంటి జవాబు రాలేదని చెప్పారు.
ఎంఎంటీఎస్ ఫేజ్–2కు రాష్ర్ట ప్రభుత్వం తన వాటా ఇవ్వడం లేదని చెబుతూ దీంతో 2018లోనే పూర్తి కావాల్సిన ప్రాజెక్టు.. 2022 పూర్తవుతున్నా కాలేదని చెప్పారు. రూ.800 కోట్ల ప్రాజెక్టు ఖర్చు కాస్త రూ.1169.23 కోట్లకు పెరిగిందని తెలిపారు. ‘‘రాష్ర్ట ప్రభుత్వ వాటా రూ.500.41 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. నిధులు విడుదల చేయాలని రాష్ట్ర సర్కార్ కు నాలుగు సార్లు లేఖ రాశాం” అని చెప్పారు.
రూ. 800 కోట్ల ప్రాజెక్టునే ఎనిమిదేండ్లలో పూర్తి చేయని ప్రభుత్వం.. మూడేండ్లలో రూ.6 వేల కోట్ల ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తుందో చెప్పాలని నిలదీసేరు. ‘‘కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఫామ్ హౌస్ వదిలి జిల్లాల్లో తిరుగుతున్నారు. అబద్ధపు హామీలిస్తూ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారు” అని కిషన్ రెడ్డి హెచ్చరించారు.