ట్రాన్స్‌విమెన్‌ టీచర్‌ను తొలగించడంపై ఎన్సిడబ్ల్యు ఆగ్రహం

ట్రాన్స్‌విమెన్‌ టీచర్‌ను విధుల నుంచి తొలగించిన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై విచారణ జరిపించాలంటూ ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. ఉత్తరప్రదేశ్‌‌లోని లఖీంపూర్ ఖేరీలో జరిగిందీ ఘటన. టీచర్ లింగమార్పిడి మహిళ అన్న ఒకే ఒక్క కారణంతో స్కూలు యాజమాన్యం ఆమెను విధుల నుంచి తొలగించినట్టు ఆరోపణలున్నాయి.
విషయం కాస్తా జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ దృష్టికి రావడంతో ఆమె తీవ్రంగా స్పందించారు. వెంటనే యూపీ ముఖ్య కార్యదర్శికి లేఖ రాస్తూ ఈ ఘటనపై విచారణ జరిపించాలని ఆదేశించారు. బాధిత ట్రాన్స్‌విమెన్‌పై స్కూలు అధికారులు చేసిన ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకున్నదీ వారం రోజుల్లో తమకు తెలియజేయాలని ఆమె ఆదేశించారు. లేఖ కాపీని లఖీంపూర్ ఖేరీ కలెక్టర్‌కు కూడా పంపారు. మరోవైపు, ట్రాన్స్ విమెన్ కారణంగానే టీచర్‌ను విధుల నుంచి తొలగించినట్టు వచ్చిన ఆరోపణలను స్కూలు యాజమాన్యం ఖండించింది.
విధుల్లో ఆమె అసమర్థత కారణంగానే తొలగించినట్టు పేర్కొంది. లింగమార్పిడి చేయించుకున్న వ్యక్తులపై వివక్షను రూపుమాపడంతో పాటు, వారికి కూడా అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలను కల్పించేందుకు కేంద్రం 2019లో లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల రక్షణ) చట్టాన్ని తీసుకొచ్చింది.