థ్యాంక్యూ గుజరాత్… అద్భుతమైన ఎన్నికల ఫలితాలు

గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ చరిత్రాత్మక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగంగా స్పందించారు. అసాధారణ విజయాన్ని కట్టబెట్టిన గుజరాత్ జనశక్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానంటూ ధన్యవాదాలు తెలిపారు.
 
 ‘‘నా సొంత రాష్ట్రం గుజరాత్ కు ధన్యవాదాలు.  అద్భుతమైన ఎన్నికల ఫలితాలు చూసి   భావోద్వేగానికి లోనయ్యాను’’ అని పేర్కొంటూ ఆయన ట్వీట్ చేశారు. ‘‘అభివృద్ధి రాజకీయాలను ప్రజలు ఆశీర్వదించారు. రానున్న రోజుల్లోనూ ఇదే ఊపు కొనసాగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా” అని తెలిపారు.
 
ఇదే సమయంలో శాంతిపూర్వక పరిస్థితులను కొనసాగించాలనే కోరికను ప్రజలు తెలియజేశారని చెబుతూ గుజరాత్ జనశక్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొంటూ ఆయన ట్విట్ చేశారు. ఈ ఎన్నికల్లో తమకు అండగా నిలిచిన హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు కూడా ఆయన ధన్యవాదాలు చెప్పారు.  ‘‘హిమాచల్ ప్రజల ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషిచేస్తాం. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను లేవనెత్తి మాట్లాడుతాం’’ అని మోదీ పేర్కొన్నారు. 
 
కాగా, గుజరాత్‌లో తొలిసారి ఖాతా తెరిచిన ఆప్ జాతీయ పార్టీగా అవతరించిందని ఆ పార్టీ నేషనల్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ‘‘పదేళ్లక్రితం ఆప్ ఒక చిన్న పార్టీ. ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నడుపుతోంది. జాతీయ పార్టీగా రూపాంతరం చెందింది’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
 
గుజరాత్ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సీఆర్ పాటిల్‌లను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అభినందించారు. గుజరాత్ ఎన్నికల్లో ఏకపక్ష విజయానికి కారణమైన ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తను ఆయన మెచ్చుకున్నారు.
 
 సీఎం భూపేందర్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ ‘‘గుజరాత్ ఎన్నికల ఫలితం స్పష్టమైంది. గుజరాత్‌ అభివృద్ధితో కలిసి ప్రయాణించాలని ఓటర్లు నిర్ణయించారు. ప్రజల తీర్పును హూందాగా స్వాగతిస్తున్నాం. ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నారు.’’ అని వ్యాఖ్యానించారు. 
గుజరాత్ లో బీజేపీ ఘన విజయం సాధించడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ  హర్షం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గుజరాత్ ప్రజలు బీజేపీ, ప్రధాన మంత్రి నాయకత్వంపై నమ్మకం ఉంచి ఇంతటి ఘన విజయాన్ని కట్టబెట్టారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. వరుసగా ఏడోసారి బీజేపీకి పట్టం కల్పించిన గుజరాత్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. గుజరాత్ ఫలితాలు కచ్చితంగా తెలంగాణపై ప్రభావం పడుతుందని డీకే అరుణ స్పష్టం చేశారు.