ఆజం ఖాన్ కంచుకోటలో బీజేపీ అనూహ్య గెలుపు

ఉత్తరప్రదేశ్ లో  సమాజ్ వాదీ పార్టీ ముఖ్యనేత ఆజం ఖాన్ కు కంచుకోట రాంపూర్ సదర్ లో తొలిసారి బిజెపికి అనూహ్య విజయం లభించింది.  ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఆకాశ్ సక్సేనా విజయ దుందుభి మోగించారు.  సమాజ్ వాదీ పార్టీ టికెట్ పై పోటీచేసిన ఆజం ఖాన్ అనుచరుడు ఆసిమ్ రజాపై ఆకాశ్ సక్సేనా 33 వేలకు పైగా ఆధిక్యతతో  గెలుపు సాధించారు.
ఆకాశ్ సక్సేనా 62 శాతం ఓట్లు సాధించగా,  ఆసిమ్ రజా 36.16 శాతం ఓట్లు మాత్రమే పొందడం గమనార్హం.  వాస్తవానికి రాంపూర్ సదర్ ఎమ్మెల్యేగా ఆజం ఖాన్ ఉండేవారు.  2019 సంవత్సరంలో విద్వేషపూరిత ప్రసంగం చేసిన  కేసులో  ఆజం ఖాన్ ను కోర్టు దోషిగా ప్రకటించింది. దీంతో ఎమ్మెల్యే పదవిలో కొనసాగే అర్హతను ఆయన కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఖాళీ అయిన రాంపూర్ సదర్ స్థానానికి ఇటీవల బై పోల్ జరిగింది. 1980 నుంచి 1993 సంవత్సరాల మధ్యకాలంలో రాంపూర్ సదర్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో  వివిధ పార్టీల నుంచి పోటీచేసి ఆజంఖాన్ గెలిచారు. 2002 నుంచి 2019 మధ్య జరిగిన ఎన్నికల్లోనూ ఆజంఖాన్, ఆయన కుటుంబ సభ్యులే ఈ స్థానం నుంచి నెగ్గారు.