గుజరాత్‌ ఎన్నికల్లో బిజెపి భారీ విజయం

గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. వరుసగా ఏడవసారి గెలుపొంది చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఎప్పుడు లభించిన ఆధిక్యతతో గెలుపొంది తన రికార్డును తానే బిజెపి అధిగమించింది.
156 స్థానాలతో గుజరాత్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీకి లభించనన్ని  అత్యధిక సీట్లు లభించాయి. కాంగ్రెస్ 18 సీట్లకు పరిమితం కావలసి వచ్చింది. అధికారంలోకి వస్తామనుకున్న పార్టీకి ఇన్ని తక్కువ సీట్లు రావడం విస్మయం కలిగిస్తుంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ 5 సీట్లతో సరిపుచ్చుకోవలసి వచ్చింది.
ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ గట్లోదియా స్థానం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గాధ్వీ ఖంబాలియాలో ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి చేతిలో ఆయన 19 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని సాధించడంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఈ నెల 12న తిరిగి ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ గుజరాత్‌  అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ ప్రకటించారు. గాంధీనగర్‌లో పదవీ ప్రమాణస్వీకారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతతో విజయం సాధ్యమైందని, మరోసారి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ విజయంలో ప్రతి  కష్టపడి పనిచేసిన ప్రతి పార్టీ కార్యకర్త ఓ ఛాంపియన్ అని పేర్కొంటూ వారు లేకుండా ఈ ఘన విజయం సాధ్యం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ట్వీట్ లో వారికి అభినందనలు తెలిపారు. వారే పార్టీకి నిజమైన బలం అని పేర్కొన్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ కష్టంతోనే గుజరాత్‌లో గెలుపు సాధ్యం అయిందని రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ ఫార్ములాతోనే ఈ విజయం సొంతమైందని పేర్కొన్నారు. మోదీ నాయకత్వంలో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

గుజరాత్‌లో విజయాన్ని అందించిన ప్రజలకు హోంశాఖ మంత్రి అమిత్ షా ధన్యవాదాలు తెలిపారు. ఈ విజయం ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి నమూనాపై విశ్వాసాన్ని ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. గుజరాతీలు ఉచితాలు, బుజ్జగింపులు, శుష్కవాగ్దానాలను తిరస్కరించి తిరుగులేని తీర్పునిచ్చారని పేర్కొన్నారు.

గుజరాత్ ప్రజలు ఇచ్చిన తీర్పును కొనియాడుతూ అమిత్ షా అనేక ట్వీట్లు కూడా చేశారు. “నరేంద్ర మోదీ అభివృద్ధి మోడల్‌కు తిరుగులేని విశ్వాసంతో ప్రజలు పట్టంగట్టారు” అని పేర్కొన్నారు. “గత రెండు దశాబ్దాలలో, మోడీజీ నాయకత్వంలో బిజెపి అన్ని అభివృద్ధి రికార్డులను బద్దలు కొట్టింది. నేడు గుజరాతీలు ఇది వరకటి రికార్డులను కూడా బద్ధలు కొట్టి బిజెపిని గెలిపించారు” అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి వర్గం ప్రజలు అది మహిళలు, యువకులు, రైతులు…ఎవరైనా కానీ హృదయపూర్వకంగా బిజెపిని గెలిపించారని చెప్పారు.

గుజరాత్‌ జామ్‌నగర్‌ నార్త్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 31 వేలకు పైగా భారీ మెజార్టీ సాధించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. తొలుత ఆమె వెనుకంజలో ఉన్న విషయం తెలిసింది.

అయితే, ఫలితాలను షాక్‌కు గురి చేశాయని గుజరాత్‌ పీసీసీ అధ్యక్షుడు  జగదీష్‌ ఠాకూర్‌ చెప్పారు. బీజేపీకి మరోసారి అధికారం ఇవ్వాలన్న ప్రజల తీర్పు తనను ఆశ్చర్యానికి గురి చేసిందని, ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్‌ శక్తివంచన లేకుండా కష్టపడిందని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. “గుజరాత్‌లో కాంగ్రెస్ ఓటమి ఆమాద్మీ, ఎంఐఎం పార్టీలే కారణం. ఈ రెండు పార్టీల వల్ల మా ఓటు బ్యాంక్ చీలింది” అని ఆరోపించారు.