మెయిన్‌పురిలో రికార్డు మెజార్టీతో డింపుల్ యాదవ్ గెలుపు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికలో మాజీ ముఖ్యమంత్రి  అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు.  మెయిన్‌పురి  లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన డింపుల్ ఘన విజయం సాధించారు.
 
డింపుల్ తన సమీప బీజేపీ అభ్యర్థి రఘురాజ్ షాక్వాపై 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో ఆయన కోడలు, ఎస్పీ అధినేత, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ బరిలో దిగారు.
 
2019 ఎన్నికల్లో ములాయం సింగ్ యాదవ్ 94 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్‌పై విజయం సాధించారు. ఇప్పుడు డింపుల్ యాదవ్ రెండు లక్షలకు పైగా మెజార్టీనితో గెలుపొందడం గమనార్హం. సమాజ్ వాదీ పార్టీ కంచుకోటగా ఉన్న  మెయిన్‌పురి కి డిసెంబర్ 5న ఉపఎన్నిక జరిగింది. 56 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. ఎస్పీకి 64.2 శాతం ఓట్లు రాగా, బీజేపీకి 34.1 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఎస్పీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఈ సందర్భంగా తన నాయకత్వంలోని ప్రగతివాద సమాజవాద్ పార్టీ (లోహియా)ను సమాజవాద్ పార్టీలో విలీనం చేస్తున్నట్లు అఖిలేష్ యాదవ్ బాబాయి శివపాల్ సింగ్ యాదవ్ ప్రకటించారు.