హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ గెలుపు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీని ఓటర్లు తిరస్కరించారు. ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ 39 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 26 చోట్ల విజయం సాధించి, ఇతరులు 3 చోట్ల గెలుపొందారు.

ఒకసారి అధికారాన్ని సాధించిన పార్టీ మరోసారి విజయాన్ని అందుకున్న దాఖలలు లేవు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడంతో కాంగ్రెస్‌ కార్యకర్తలు సంబురాలు జరుపుకుంటున్నారు.  కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలుచుకోవడంతో ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. 

ఈ సందర్భంగా హిమాచల్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పీసీసీ అధ్యక్షురాలు ప్రతిభా వీరభద్రసింగ్‌ మాట్లాడుతూ ప్రజలకు ఆదేశం ఇచ్చారని, భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. గెలిచిన అభ్యర్థులు తమ వెంటే ఉంటారని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న ఆమె.. ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు ప్రజా తీర్పును గౌరవిస్తూ మరి కాసేపట్లో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్‌కు తన రాజీనామాను సమర్పించనున్నట్టు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్  తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, గత ఐదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన ప్రధాని, కేంద్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన చెప్పారు.హిమాచల్‌ ప్రజల ప్రయోజనాల కోసం బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు.

 రాజకీయాలతో సంబంధం లేకుండా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఎన్నికల ఫలితాలను విశ్లేషించి, ఎక్కడ ఇబ్బందులు తలెత్తాయో తెలుసుకుని వచ్చే ఎన్నికల నాటికి అధిగమించి మెరుగైన ఫలితాలు సాధిస్తామని తెలిపారు.

అయితే తమకు సంఖ్యా బలం మజిగ్ నంబర్ కు అంచులో ఉండడంతో కాంగ్రెస్ తమ ఎమ్యెల్యేలను జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నది.  ఇప్పటికే తన ఎంఎల్‌ఏలను ఛండీగఢ్‌కు తరలించడం మొదలెట్టింది. తదుపరి ఏమి చేయాలన్న కార్యాలోచనపై వారు అక్కడ చర్చించనున్నట్లు తెలుస్తోంది.