వరుసగా నాలుగోసారి ఫోర్బ్స్ జాబితాలో నిర్మలా!

2022 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ వరుసగా నాలుగో సారి అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మల సీతారామన్ మరోసారి చోటు సంపాదించారు.
 
భారతదేశంలో ఆరుగురికి ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కగా అందులో కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ముందు వరుసలో నిలిచారు. నిర్మల సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకోవడం ఇది వరుసగా నాలుగో సారి.
 
నిర్మల సీతారామన్ తో పాటు భారత దేశం నుంచి బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా, నైకా వ్యవస్థాపకులు ఫల్గుణి నాయర్, సెబి చైర్ పర్సన్ మదాభి పురి బచ్, హెచ్సిఎల్ టెక్నాలజీస్ చైర్పర్సన్ రోష్ని నాడార్ మల్హోత్రా, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మొండల్ ఫోర్బ్స్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.
 
63 సంవత్సరాల మంత్రి నిర్మల సీతారామన్ 2019లో 34వ స్థానంలో, 2020 వ సంవత్సరంలో 41వ స్థానంలో, 2021లో ఫోర్బ్స్ జాబితాలో 37వ స్థానంలో నిలువగా, 2022 వ సంవత్సరంలో నిర్మలా సీతారామన్ 36వ స్థానంలో నిలిచారు.  వరుసగా నాలుగు సంవత్సరాలుగా ఆమె శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు. పరపతి, మీడియా, ప్రభావం,  ప్రభావిత రంగాలు ఆధారంగా, వీటిని కొలమానంగా తీసుకొని ఫోర్బ్స్ జాబితా రూపొందిస్తుందని వెల్లడించారు.
 
ఇదిలా ఉంటే భారతదేశం నుంచి శక్తివంతమైన మహిళల జాబితాలో స్థానం దక్కించుకున్న ఫల్గుణి నాయక్ గత సంవత్సరం 88 వ స్థానంలో నిలువగా ఈసారి 89 వ స్థానంలో నిలిచారు. రోష్ని నాడార్ గతేడాది 52 వ ర్యాంక్లో నిలువగా ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితాలో 53వ ర్యాంకు సాధించారు.  ఇక కిరణ్ మజుందార్ షా మాత్రం 2021, 2022 రెండు సంవత్సరాలలోనూ 72వ స్థానంలో నిలిచారు. సెబి చైర్ పర్సన్ మదాభి పురి బచ్ 54వ స్థానంలో, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ సోమా మొండల్ 67 వ స్థానంలో నిలిచినట్లు ఫోర్బ్స్ జాబితాలో వెల్లడించింది.
 
మరోవంక,  ఈసారి ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డేర్ తొలి స్థానంలో నిలిచారు.
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఆమె నాయకత్వం, అలాగే కరోనా  మహమ్మారి నిర్వహణ కోసం ఆమె చేసిన కృషికి గుర్తింపుగా 19వ వార్షిక ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు.
 
 “ఆమె ప్రభావం ప్రత్యేకమైనది. జాబితాలోని ఆమె కాక మరెవరూ 450 మిలియన్ల ప్రజల తరపున పాలసీని రూపొందించలేదు.  స్వేచ్ఛా, ప్రజాస్వామ్య సమాజానికి ఆమె నిబద్ధత తిరుగులేనిది. వాన్ డెర్ లేయెన్ 2022లో  అతిపెద్ద కథాంశపు ఒక ముఖం మాత్రమే: మహిళలు ప్రజాస్వామ్యానికి ధీటుగా వ్యవహరిస్తున్నారు, ”అని ఫోర్బ్స్ కొనియాడింది.  యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టినా లగార్డే రెండవ స్థానంలో, అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్ మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా చూస్తే ఫోర్బ్స్ శక్తిమంతుల జాబితాలో మరోసారి నిర్మల సీతారామన్ వరుసగా నాలుగో సారి స్థానం దక్కించుకొని తన సత్తా చాటారు.