మతం మారిన దళితులకు ఎస్సీ హోదాపై కేంద్రం స్పష్టం

మతం మారిన దళితులకు ఎస్సీ హోదాలో రిజర్వేషన్లు కల్పించే విషయంలో రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ సిఫారసులను ఆమోదించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంలో సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ నేతృత్వంలో కొత్తగా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
 
 సిక్కు, బౌద్ధ మతాలు మినహా ఇతర మతాలు స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే విషయాన్ని పరిశీలించేందుకు జస్టిస్‌ కేజీ బాలకృష్ణన్‌ అధ్యక్షతన ఈ ఏడాది అక్టోబరులో త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం రాజ్యాంగ నిబంధనల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన వారిని మాత్రమే ఎస్సీలుగా గుర్తిస్తున్నారు.
 
 తొలుత కేవలం హిందూ మతంలోని వారికి మాత్రమే ఎస్సీ హోదా ఉండేది. అనంతరం 1956లో రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కులకు, 1990లో సవరణ ద్వారా బౌద్ధ మతం స్వీకరించిన దళితులకు ఎస్సీ హోదా కల్పించారు. అయితే మాజీ సీజేఐ జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా నేతృత్వంలోని కమిషన్‌ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించవచ్చని 2007లో ‘మత, భాషాపరమైన మైనారిటీల జాతీయ కమిషన్‌’కు నివేదిక సమర్పించింది.

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ దళిత క్రైస్తవుల జాతీయ మండలి (ఎన్‌సీడీసీ) దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణ సందర్భంగా ఈ అంశంపై అఫిడవిట్‌ సమర్పించాలంటూ సుప్రీంకోర్టు 2020లో కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం జరిగిన విచారణలో ఈ అంశంపై మూడు వారాల్లోగా అఫిడవిట్‌ సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఎస్సీల ఆర్డర్ 1950.. రాజ్యాంగ విరుద్ధమైన ఏ అంశాన్నీ సమర్థించదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అంటరానితనం ఇతర కొన్ని కారణాల వల్ల ఎస్సీలు… క్రైస్తవ, ఇస్లాం మతంలోకి మారడానికి ఈ ఆర్డర్ మినహాయింపు ఏమీ ఇవ్వట్లేదని వివరించింది. రాజ్యాంగంలోని ఈ ఆర్డర్‌కి కాలక్రమంలో సవరణలు చేస్తూ ఉన్నారు. దీని ప్రకారం.. హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం కాకుండా ఇతర మతాన్ని.. తమ మతంగా ప్రకటించే వ్యక్తిని.. షెడ్యూల్డ్ కులం (ఎస్సీ)లో సభ్యులుగా పరిగణించరు.

షెడ్యూల్డ్ కులాల ఆర్డర్ 1950 అనేది.. రాజ్యాంగంలోని సమానత్వ హక్కును తెలిపే ఆర్టికల్ 14, మత వివక్షను అడ్డుకునే ఆర్టికల్ 15కి వ్యతిరేకంగా ఉంది అని చెబుతూ..  కేంద్రం తాజా స్పష్టత ఇచ్చింది.  కేంద్రం అఫిడవిట్‌ సమర్పించిన వారం రోజుల తర్వాత అభ్యంతరాలను సమర్పించాలని పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించింది. ఈ కేసును జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఓక్లా, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌ల ధర్మాసనం బుధవారం విచారించింది. 

పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తాజాగా అఫిడవిట్‌ సమర్పించారు. కొత్త కమిషన్‌ నివేదిక ఇవ్వడానికి రెండేళ్లు పట్టే అవకాశం ఉందని తెలిపారు. స్పందించిన ధర్మాసనం.. కేంద్రం తాజాగా నియమించిన కమిషన్‌ నివేదిక వచ్చే వరకు ఆగాలా? అని అడిగింది. ప్రస్తుతం ఉన్న రికార్డుల ఆధారంగా విచారణ జరపాలా? లేక కొత్త కమిషన్‌ నివేదిక వచ్చే వరకు వేచి ఉండాలా? అని ప్రశ్నించింది. తదుపరి విచారణను జనవరికి వాయిదా వేసింది.