కుట్ర మోపిన వారికి చెంప ఛెల్లుమనేలా ఏసీబీ కోర్టు తీర్పు

రాజకీయ కలకలం రేపుతున్న ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో  తనను విచారణకు పిలవడం, ఏకంగా నిందితునిగా చేర్చడాన్ని తప్పుబడుతూ ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు తమపై కుట్ర మోపిన వారికి చెంప ఛెల్లుమనేలా ఉందని బిజెపి ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ధ్వజమెత్తారు.
 
ఈ కేసులో సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసిన అనంతరం మొదటిసారిగా ఈ కేసుపై వ్యాఖ్యానిస్తూ భారతమాత, ధర్మం కోసం పనిచేసే వారిపై కేసీఆర్ కుట్ర చేశారని బీఎల్ సంతోష్ మండిపడ్డారు.  తమకు జైలు కొత్త కాదని, కేసీఆర్ కూతురు లాగా సారా కేసులో వెళ్లలేదని బీఎల్ సంతోష్ ఘాటుగా స్పందించారు.
 
కేసీఆర్ సర్కారుపై యుద్ధం ప్రారంభించామని చెబుతూ ఒక ఏడాదిలో బీజేపీని అధికారంలోకి తెస్తామని బీఎల్ సంతోష్ స్పష్టం చేశారు. డ్రగ్స్ దందా చేసేది సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులేనని ఆరోపించారు. బెంగళూరు డ్రగ్స్ కేసును తిరిగతోడుతామని హెచ్చరించారు.  తెలంగాణలో ఒకసారి బీజేపీకి అవకాశం ఇచ్చి.. కాషాయపు జెండాను ఆదరించాలని ఆయన రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
80 శాతం హిందువుల కోసం పనిచేసేది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ కోసం యుద్ధం చేసేవారికి బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
హిందువుల సనాతన ధర్మాన్ని కించపరిస్తే భరించలేమని సంతోష్ హెచ్చరించారు. హిందువుల మేలు కోసం పనిచేస్తామని చెబుతూ ఎన్ని కుట్రలు చేసుకున్నా తెలంగాణలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని సంతోష్ భరోసా వ్యక్తం చేశారు.

 
కాగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన డాక్టర్ జగ్గుస్వామి, తుషార్ వెల్లాపల్లి, బూసారపు శ్రీనివాస్ లను నిందితులు చేర్చాలంటూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది.
 
మొదటి ముగ్గురు నిందితుల నేరాంగీకర వాంగ్మూలంలో ఎక్కడా ఈ నలుగురి పేర్లు లేవని, ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్ట్ తదితరాల్లోనూ ఈ నలుగురి పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఏసీబీ చట్టం కింద కేసుల్ని శాంతిభద్రతల పోలీసులుగానీ, సిట్ గానీ దర్యాప్తు చేయకూడదనే అంశాన్ని కోర్టు పరిగణలోకి తీసుకుంటోంది.  అయితే, ఏసీబీ కోర్టు తీర్పుపై సిట్ పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు.
 
హైకోర్టు దృష్టికి సిట్ కౌంటర్ లీక్
 
ఇలా ఉండగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ దాఖలు చేసిన కౌంటర్ లీక్ అవడంపై హైకోర్టులో వాదనలు జరిగాయి. రహస్యంగా ఉంచాలనుకున్న సిట్ నివేదిక ఎలా బయటకు వచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించారు. సిట్ కౌంటర్ కాపీలను పిటిషనర్లు, వారి తరపు న్యాయవాదులకు అందించామని అదనపు అడ్వకేట్ జనరల్ తెలిపారు.
 
పిటిషనర్లు ఓ రాజకీయ పార్టీకి అందించారని వారి ద్వారా మీడియా లీక్ అయిందని ఏఏజీ తెలియజేశారు. ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఓ కాపీ ఇచ్చామని ఆయన ద్వారా సీఎంకు చేరి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కౌంటర్ కాపీ సిట్ ద్వారా బయటకు రాలేదని అదే రోజు పత్రిక ప్రకటనను సీవీ ఆనంద్ విడుదల చేశారని ఏఏజీ హైకోర్టుకు తెలియజేశారు.