తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే యత్నం చేస్తున్న కేసీఆర్

‘‘కేసీఆర్ కుటుంబం లక్షల కోట్ల ప్రజాధనం దోచుకుంది. దోచుకున్న సొమ్ముతో దొంగ సారా దందా చేస్తోంది. లిక్కర్ కేసులో ఇరుక్కున్న తన బిడ్డ కవితను అరెస్టు చేస్తే, మరోసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయంగా లబ్ధి పొందాలని కేసీఆర్ చూస్తున్నారు” అని బండి సంజయ్ ఆరోపించారు.  నిర్మల్ జిల్లాలో పాదయాత్రలో భాగంగా ఖానాపూర్, బాదన్ కుర్తిలో నిర్వహించిన సభల్లో మాట్లాడుతూ  కేసీఆర్ కుట్రను తిప్పికొట్టేందుకు అందరూ సిద్ధం కావాలని పిలుపిచ్చారు. కేసీఆర్ యుద్ధం మొదలుపెట్టిండని, దానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కేసులు, రౌడీ షీట్లు, దాడులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగిరేదాకా పోరాటం చేస్తామని చెబుతూ దేశం, ధర్మం కోసం పని చేస్తున్న బీఎల్ సంతోష్ జీపై కేసులు పెడతారా? అని మండిపడ్డారు. ఏసీబీ కోర్టు చెంపచెల్లుమనిపించినా కేసీఆర్ కు సిగ్గు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ ధరణి పోర్టల్ తెచ్చి, పేదల భూములు గుంజుకుంటున్నారని సంజయ్ ఆరోపించారు. ‘‘కేసీఆర్ ఫామ్ హౌస్ లో వాడే కరెంటుతో 30 నుంచి 40 గ్రామాలకు కరెంట్​ఇవ్వొచ్చు. ప్రభుత్వం డిస్కమ్​లకు వేల కోట్ల బకాయి ఎందుకు పడిందో చెప్పాలి. ధాన్యం సేకరణకు కేంద్రమే నిధులిస్తోంది. ఇందులో రాష్ట్ర సర్కార్ మధ్యవర్తి మాత్రమే” అని చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కమీషన్లు కావాల్సిందేనని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాల్లేక నిరుద్యోగులంతా గల్ఫ్ దేశాలకు వలస పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో నిధుల్లేక గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. నిధులు, బిల్లులు రాక సర్పంచ్ లు ఆత్మహత్య  చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ కు మరోసారి అధికారం ఇస్తే ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తారని విమర్శించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనకు ముగింపు పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
15న కరీంనగర్ లో  యాత్ర ముగింపుకు నడ్డా

 
బండి సంజయ్ చేపట్టిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ఒక రోజు ముందుగా ఈ నెల 15న ముగియనున్నది. ఈ సందర్భంగా కరీంనగర్ లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా పాల్గొంటున్నారు.   వాస్తవానికి ఈనెల 16న బహిరంగ సభ నిర్వహించాలని తలపెట్టినప్పటికీ, ఆరోజు జేపీ నడ్డాకు అత్యవసర కార్యక్రమాలున్నందున ఒకరోజు ముందే బహిరంగ సభ నిర్వహిస్తున్నారు.