శాస్త్రీయ పరిశోధన ఆధారంగానే జీఎం ఆవాలకు అనుమతి 

జన్యుపరంగా మార్పులు చేసిన ఆవాలకు అనుమతి ఇవ్వడంపై వ్యక్తమవుతున్న ఆందోళనలను కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కొట్టిపారేసారు. సైంటిఫిక్ రీసెర్చ్ ఆధారంగా, నిర్దేశిత నియంత్రణ ప్రక్రియను పాటించి జీఎం ఆవాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. 
 
ఇండియన్ ఎక్సప్రెస్స్  నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ గత అక్టోబర్ లో అనుమతి ఇవ్వడంపై చెలరేగిన అభ్యంతరాలను ప్రస్తావించారు.  నియంత్రణ వ్యవస్థల పర్యవేక్షణలో ఈ పంటను నిరంతరం వినియోగించడం ద్వారా మాత్రమే తదుపరి ఆందోళనలను పరిష్కరిస్తామన్నారు. ఈ ఆవాలకు అనుమతి ఇవ్వడంలోని ఉద్దేశం అదేనని ఆయన చెప్పారు.
ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే శాస్త్రీయ పరిశోధన అవసరమా? కాదా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. నూతన శాస్త్రీయ పరిశోధన, శాస్త్రీయ నవ కల్పనలను ఉపయోగించుకోవాలా? వద్దా? జీఎం మస్టర్డ్ (జీఎం ఆవాలు)లో ఢిల్లీ విశ్వవిద్యాలయం సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తే, దానిని రెండేళ్లపాటు అయినా ప్రయత్నించాలా? వద్దా? అని ఆయన నిలదీశారు.
జీఎం పంటలు మన దేశ ఆహార భద్రతకు అద్భుతంగా ఉపయోగపడతాయని భూపేంద్ర యాదవ్ స్పష్టం చేశారు.  మన దేశంలో వినియోగిస్తున్న వంట నూనెల్లో దాదాపు 55 నుంచి 60 శాతం వరకు దిగుమతి అవుతోందని, అది జీఎం ఫుడ్స్‌కు అనుమతి ఉన్న దేశాల నుంచి వస్తోందని ఆయన పేర్కొన్నారు.
అంటే మనం ఆ దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవచ్చు కానీ, మనమే సొంతంగా ఉత్పత్తి చేయకూడదా? అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. జీఎం పంటలు, జీఎం ఫుడ్స్ విషయంలో ప్రజల్లో కొంత ఆందోళన ఉందని చెప్పారు. పరపరాగ సంపర్కానికి దోహదపడే జీవులు, తేనెటీగల గురించి ఆందోళన వ్యక్తమవుతోందని తెలిపారు.
కానీ ఈ సందర్భంలో ఫలితాన్ని విశ్లేషించవలసి ఉందని చెబుతూ తేనెటీగలపై ప్రభావాన్ని శాస్త్రీయంగా పరిశోధించాలని, ఆ ఫలితాలను సమర్పిస్తే, వాటిని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని యాదవ్ భరోసా ఇచ్చారు. జీఎం పంటలు సురక్షితమైనవేనని రుజువైతే, వాణిజ్య ఉత్పత్తి కోసం వాటిని ఉపయోగించడంలో తప్పు ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు.
 మన దేశం స్వయం సమృద్ధం కానక్కర్లేదా? అని ప్రశ్నించారు. బోల్‌గార్డ్ పత్తి-2కు 2006లో జీఎం అనుమతులు లభించాయి. పదహారేళ్ళ తర్వాత తొలిసారి జీఎం మస్టర్డ్‌కు పర్యావరణ మంత్రిత్వ శాఖలోని జెనెటిక్ ఇంజినీరింగ్ అప్రయిజల్ కమిటీ అనుమతి ఇచ్చింది. దీంతో జీఎం ఆవాల వాణిజ్య ఉత్పత్తికి బాటలు పడుతున్నాయి.