బలవంతపు మతమార్పిడులు రాజ్యాంగ విరుద్ధం

బలవంతపు మతమార్పిడి ‘చాలా సీరియస్ విషయం’అని, పైగా అది రాజ్యాంగ విరుద్ధం అని సుప్రీంకోర్టు సోమవారం పునరుద్ఘాటించింది. ‘భయపెట్టి, బెదిరించి, మోసగించి, బహుమానాలు, డబ్బు వగైరాలతో ప్రలోభపరచి’ మతాంతీకరణకు పాల్పడ్డం విషయంలో కేంద్రం, రాష్ట్రాలు కఠిన చర్యలు చేపట్టాలని అడ్వొకేట్ అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ్ పెట్టుకున్న వినతిని కోర్టు పరిశీలించినప్పుడు ఈ వ్యాఖ్యలు చేసింది.
అలాంటి పద్ధతులతో మతాంతీకరణ జరిగిన సమాచారాన్ని రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. న్యాయమూర్తులు ఎంఆర్ షా, సిటి. రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం ముందు హాజరైన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదన వినిపిస్తూ ఈ అంశంపై పూర్తి సమాచారాన్ని అందించేందుకు కొంత గడువును కోరారు.
“మేము రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఓ వారం రోజుల గడువు మాకు ఇవ్వండి” అని మెహతా అన్నారు. ఒక వ్యక్తి తన మత విశ్వాసం మార్పు కారణంగా మతం మారుతున్నాడా అనేది చట్ట పాలన నిర్ణయిస్తుంది అన్నారు. కాగా బలవంతపు మత మార్పిడి చాలా సీరియస్ అంశం అని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది.
అభ్యర్థన నిర్వహణ అంశాన్ని న్యాయవాది ప్రశ్నించినప్పుడు ధర్మాసనం “అంతగా సాంకేతికంలోకి పోకండి. మేమిక్కడ ఉన్నది పరిష్కారాన్ని కనుగొనడానికి, ఓ కారణం కోసం మేమున్నాం, విషయాలను చక్కదిద్దడానికి మేమున్నాం. ఒకవేళ ఛారిటీ ఉద్దేశ్యం మంచిదే అయితే మేము స్వాగతిస్తాం. కానీ ఉద్దేశ్యం ఎలాంటిదన్నది కూడా పరిశీలించాల్సి ఉంటుంది” అన్నది.
 “ఈ అంశాన్ని తప్పుగా తీసుకోకండి. ఇది చాలా సీరియస్ అంశం. అంతిమంగా రాజ్యాంగ విరుద్ధమైనది. ఎప్పుడైతే అందరూ భారత్‌లో నివసిస్తుంటే, వారంతా భారత సంస్కృతి ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది” అని ధర్మాసనం అభిప్రాయపడింది. “బలవంతపు మతమార్పిడులు జాతీయ భద్రతకు, పౌరుల మత స్వేచ్ఛకు ముప్పు కలిగిస్తాయి. ఈ సీరియస్ అంశాన్ని నియంత్రించేందుకు కేంద్రం నిబద్ధతతో చర్యలు తీసుకోవాలి” అని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
“మందులు, ఆహార ధాన్యాలు అందించి ఇతర మతాల్లోకి మారేలా ప్రజలను ప్రలోభపెట్టడం చాలా తీవ్రమైన సమస్య అని జస్టిస్‌ ఎంఆర్‌ షా పేర్కొన్నారు. ‘ప్రత్యేకమైన వ్యక్తులకు సహాయం చేయాలని మీరు విశ్వసిస్తే వారికి సహాయం చేయండి. అంతే కానీ అది మత మార్పిడి కోసం ఉండకూడదు” అని జస్టిస్‌ ఎంఆర్‌ షా అభిప్రాయం వ్యక్తం చేశారు.

ప్రలోభపెట్టడం చాలా ప్రమాదకరమైనది. ఇది చాలా తీవ్రమైన సమస్య. మన రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధం. భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరూ భారతదేశ సంస్కృతికి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేశారు.  

బహుమతులు ఇవ్వడం, ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం, బెదిరింపులకు దిగడం, మోసపూరితంగా ప్రలోభపెట్టడం ద్వారా జరిగే మత మార్పిడులను నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రం, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.
 మత మార్పిడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని, అలా కుదరని పక్షంలో ఈ నేరాన్ని ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) లో చేర్చాలని పిటిషన్‌లో ఆయన కోర్టుకు విన్నవించారు.