కరోనా మానవ నిర్మిత వైరస్, ఇది చైనా ల్యాబ్ నుంచే లీక్

 కరోనా వైరస్‌ మానవ నిర్మితమని చైనాలోని వుహాన్‌ ల్యాబ్‌లో పని చేసిన అమెరికా సైంటిస్ట్‌, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. చైనా ప్రభుత్వం నిర్వహించే వుహాన్ ఇన్సిస్ట్యూట్‌ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవి) నుంచే రెండేళ్ల కిందట కరోనా వైరస్‌ లీక్‌ అయ్యిందని తన తాజా పుస్తకం ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’లో పేర్కొన్నారు. 

చైనా ల్యాబ్‌లో అధ్యయనం చేస్తున్న కరోనా వైరస్‌లకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చడం వల్ల ఈ మహమ్మారి సంభవించిందని తెలిపారు. ‘ఇది జన్యుపరంగా రూపొందించిన ఏజెంట్ అని చైనాకు మొదటి రోజు నుండి తెలుసు. మనం వారికి (చైనా)కు బయోవెపన్ టెక్నాలజీని అందజేస్తున్నాం’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 

దాదాపు మూడేళ్ల కిందట చైనాలోని వుహాన్‌లో తొలిసారి వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ మహమ్మారి యావత్తు ప్రపంచాన్నీ కల్లోలానికి గురిచేసింది. కరోనా పుట్టుక గురించి ఇప్పటికీ ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఇది సహజసిద్ధమైంది కాదని, చైనా ల్యాబ్‌లో సృష్టించిందనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.  

ప్రభుత్వ నిర్వహణ, నిధులతో పరిశోధనలు సాగిస్తోన్న వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా లీక్ అయినట్టు రెండేళ్ల కిందట బ్రిటన్ పత్రిక ది సన్‌లో ఆండ్రూ హఫ్ ప్రకటనను ఉటంకిస్తూ న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రచురించింది.  తాజా పుస్తకం ‘ది ట్రూత్ అబౌట్ వుహాన్’లో కరోనా వైరస్‌లపై పరిశోధనల కోసం చైనాకు అమెరికా ప్రభుత్వం నిధులు సమకూర్చడం వల్ల ఈ మహమ్మారి సంభవించిందని పేర్కొన్నారు. 

సరైన భద్రత లేని ప్రయోగాల ఫలితంగా వుహాన్ ల్యాబ్‌ నుంచి కరోనా వైరస్‌ లీక్‌ అయ్యిందని సైంటిస్ట్‌, ఎపిడెమియాలజిస్ట్ ఆండ్రూ హఫ్ తెలిపారు. ‘సరైన జీవ భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌ను నియంత్రించే చర్యలు ఆ విదేశీ ప్రయోగశాలలో లేవు. ఈ నేపథ్యంలో వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్ నుంచి కరోనా వైరస్‌ లీక్‌కు దారితీసింది’ అని తన పుస్తకంలో పేర్కొన్నారు.

న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ఆండ్రూ హఫ్ అంటువ్యాధులపై అధ్యయనం సాగించే స్వచ్చంధ సంస్థ ఎకోహెల్త్ అలయన్స్ మాజీ వైస్ ప్రెసిడెంట్. చైనా స్వలాభం కోసం నిర్వహించిన ప్రయోగాలు తగినంత భద్రతతో నిర్వహించలేదని, ఫలితంగా వుహాన్ ల్యాబ్‌ నుంచి వైరస్ లీక్ అయ్యిందని హఫ్ పేర్కొన్నారు. అయితే, కరోనా తమ ప్రయోగశాల నుంచి లీక్ కాలేదని అటు వుహాన్ ల్యాబ్ పరిశోధకులు, చైనా ప్రభుత్వం ఖండించాయి. 

‘‘విదేశీ ప్రయోగశాలల భద్రత, బయోసెక్యూరిటీ, రిస్క్ మేనేజ్‌మెంట్‌ని నిర్ధారించడానికి తగిన నియంత్రణ చర్యలు లేవు.. చివరికి వుహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో ల్యాబ్ లీక్‌కు దారితీసింది. అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ దశాబ్దానికిపైగా గబ్బిలాలలో అనేక కరోనా వైరస్‌లపై అధ్యయనం చేస్తోంది. వుహాన్ ల్యాబ్‌తోనూ దీనికి సన్నిహిత సంబంధాలున్నాయి’ అని తెలిపారు.

‘గబ్బిలాల్లోని కరోనా వైరస్‌లు ఇతర జాతులపై దాడి చేసే సామర్ధ్యాన్ని అంచనా వేయడానికి ఇప్పటికే ఉన్న ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడంలో వుహాన్ ల్యాబ్‌కు హెల్త్ అలయన్స్‌ చాలా సంవత్సరాలు సహాయం చేసింది’అని హఫ్ పేర్కొన్నారు. ‘ఇది జన్యుపరంగా ఇంజనీరింగ్ చేసిన ఏజెంట్ అని చైనాకు ముందు నుంచి తెలుసని, ప్రమాదకరమైన బయోటెక్నాలజీని చైనీయులకు బదిలీ చేయడానికి అమెరికా ప్రభుత్వమే కారణం’ అని స్పష్టం చేశారు.

టీవలి ప్రోపబ్లికా లేదా వనితా ఫెయిర్ పరిశోధన ప్రకారం.. చైనాలోని వుహాన్ వైరాలజీ ల్యాబొరేటరీ అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ పరిశోధనలకు నిలయం అని నివేదించింది. ఈ పరిశోధనా సంస్థ వనరుల కొరత ఉన్నప్పటికీ దాని ప్రపంచ స్థాయిని పెంచుకోవడానికి శాస్త్రీయ పురోగతులను ఉత్పత్తి చేయడానికి పాలక చైనా కమ్యూనిస్టు పార్టీ నుంచి విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంది.