ఇతరుల కోసం జీవించినపుడే సరైన జీవితం 

మన కోసమే జీవిస్తే ఏం జీవితం.. ఇతరుల కోసం జీవించినపుడే సరైన జీవితం అవుతుంది.. మీరు ఎదగండి.. వెనక్కు చూడండి.. వెనుకబడిన వారు ఎందుకు అలా ఉన్నారో తెలుసుకుని వారినీ ముందుకు తీసుకువెళ్లటానికి కృషి చేయండి’’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్బోధించారు. 
 
 తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన  సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘సర్వశ్రేష్టమైన మనుషులమై ఉండి. మీ కోసం మాత్రమే మీరు జీవించకండి.. జంతువులు కూడా అలాగే జీవిస్తుంటాయి..”  అని తెలిపారు.  తిరుమలేశుడి పాదాల చెంత వెలసిన పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయం ఓ శక్తివంతమైన స్థలమని, ఇక్కడ చదివే విద్యార్థినులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మహిళల అభివృద్ధికి కృషి చేయాలని ఆమె సూచించారు.
 
సోమవారం మధ్యాహ్నం విశ్వ విద్యాలయంలో జరిగిన మహిళా సాధికారత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్న సందర్భంగా ఆమె విద్యార్థినులు, అధ్యాపకులు, వివిధ రంగాలలో ప్రతిభావంతులైన మహిళలు, స్వయం సహాయక సంఘాల సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టాక దేశంలో తాను మొదట సందర్శించిన విశ్వవిద్యాలయం ఇదేనని తెలిపారు. 
 
ఇక్కడ చదివిన ప్రతి విద్యార్థినీ గ్రామీణ ప్రాంతానికి సేవలందించాలని తద్వారా గ్రామీణ మహిళల సాధికారతకు పాటుపడాలని ఆమె కోరారు. దీనితో పాటు గ్రామాలకు వెళ్ళినపుడు మహిళల స్థితిగతులు తెలుసుకోవాలని, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు వారికి అందుతున్నాయా లేదా అనేది పరిశీలించాలని సూచించారు. వాటిపై నివేదికలు రూపొందించి కలెక్టర్‌కు అందించగలిగేలా వుండాలని పేర్కొన్నారు.
 
ఐఏఎస్, ఐపీఎస్‌, ఇంజనీర్లు వారి వారి గ్రామాలను దత్తత తీసుకుని, ఒకటి రెండు రోజులు రాత్రుల్లో అక్కడే ఉండాలని, మహిళలతో, పిల్లలతో, పురుషులతో మాట్లాడి ప్రభుత్వ పథకాలు వారి వద్దకు చేరుతున్నాయా? లేదా? తెలుసుకోవాలని ఆమె సూచించారు. దేశ అభివృద్ధికి ఇంకా ఎలాంటి పథకాలు కావాలని చెబుతూ పిల్లలకు ఉన్న స్కీములు సరిగ్గా ఉన్నాయా? మార్పులు చేయాలా? తెలుసుకుని కలెక్టర్‌కు నివేదికలు ఇవ్వాలని ఆమె వివరించారు. 
 
రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుతోందని పేర్కొంటూ కిచెన్ గార్డన్‌ల ద్వారా పచ్చదనాన్ని పెంచాలని ద్రౌపదీ ముర్ము సూచించారు. ఆడ, మగ బిడ్డల మధ్య బేధం చూపకూడదని, ఇద్దరినీ సమానంగా దైర్యాన్ని, అవకాశాలను కల్పించాలని ఆమె స్పష్టం చేశారు. తక్కువ చదువుకున్నాం అనే భావన వద్దని, అన్నిటికీ చదువు ముఖ్యం కాదని ఆమె పేర్కొన్నారు.
 
విశ్వవిద్యాలయంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన మహిళలతో ముఖాముఖీ మాట్లాడిన సందర్భంలో అనేక విషయాలు తెలుసుకున్నానని, అలాంటి మహిళలను కలవడం సంతోషంగానే కాకుండా గర్వంగా కూడా భావిస్తున్నానని ఆమె చెప్పారు. తిరుమల కళ్యాణకట్టలో మహిళా క్షురకులకు అవకాశం కల్పించేందుకు పోరాడిన రాధాదేవి పడిన సంఘర్షణ తనను కదిలించిందని ఆమె పేర్కొన్నారు. 
 
చేసే పని చిన్నదా పెద్దదా అని చూడరాదని, చేసే పనిని గౌరవ దృష్టితో చూడాలని రాష్ట్రపతి సూచించారు. గతంలో తనను వైస్‌ ఛైర్‌పర్సన్‌గా ఎన్నుకున్న సమయంలో తాను స్వీపర్లతో కలసి పనిచేయించడానికి నామోషీ పడలేదని చెప్పారు. చేసే పనేదో మనసు పెట్టి చేయాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో మహిళల శక్తిసామర్ధ్యాలపై తనకెలాంటి సందేహాలూ లేవని ఆమె భరోసా వ్యక్తం చేశారు. 
 గ్రామాల్లో నాటు మందులు తయారు చేసే వారు ఎంబీబీఎస్ చదవక పోవచ్చు. అయితే వారి వైద్యంలో ఎంతో నాణ్యత ఉంటుందని ఆమె గుర్తు చేశారు. గతంలో మహిళలు బ్యాంకులకు, కలెక్టరేట్‌లకు వెళ్లటానికి కూడా భయపడేవారని, స్వయం సహాయక బృందాల వల్ల కలిసి చేసే ప్రయాణంతో వారికి దైర్యం వచ్చిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
అనంతరం వర్శిటీ ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా సాధికారిత, ఉత్పత్తుల స్టాల్స్‌ను రాష్ట్రపతి పరిశీలించారు. తర్వాత ఆడిటోరియంలో వివిధ రంగాల్లో విశేష ప్రతిభా పాటవాలు ప్రదర్శించిన మహిళా ప్రముఖులతో ముఖాముఖీ మాట్లాడారు. వారా స్థితికి చేరుకునేందుకు పడిన కష్టాలు, చేసిన పోరాటాలను అడిగి తెలుసుకున్నారు.
 
 కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి, మంత్రులు రోజా, కొట్టు సత్యనారాయణ, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, కలెక్టర్‌ వెంకట్రమణారెడ్డి, వీసీ జమున, ఎస్వీయూ వీసీ రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.