విచారణకు కుంటిసాకులు వెతుక్కుంటున్న కవిత

ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ నోటీసులు జారీ చేయగానే డిసెంబర్ 6న విచారణకు అందుబాటులో ఉంటానని చెప్పిన టీఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత రోజుకొక మాట మారుస్తున్నారు. ఆ మరుసటి రోజే తనకు ఎఫ్ఐఆర్, ఫిర్యాదు ప్రతులు ఇవ్వాలంటూ సీబీఐకి లేఖ వ్రాసారు. 
 
సీబీఐ అధికారులు ఈ-మెయిల్ ద్వారా సమాధానం ఇస్తూ ఎఫ్ఐఆర్ కాపీ వెబ్ సైట్ లో ఉందని తెలిపారు. తాజాగా ఎఫ్ఐఆర్ లో తన పేరు లేనప్పుడు తనను ఎందుకు విచారణకు పిలవాలని అంటూ ప్రశ్న లేవనెత్తారు.  పైగా, డిసెంబర్ 6న విచారణకు అందుబాటులో ఉంటానని మొదట చెప్పిన ఆమె ఇప్పుడు ముందే ఖరారైన కార్యక్రమాలు ఉండటంతో రేపు విచారణకు రాలేనని చెబుతున్నారు.
ఆ మేరకు ఆమె సీబీఐ అధికారి రాఘవేంద్ర వత్సకు లేఖ రాశారు.  ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. తాను ఎఫ్ఐఆర్ కాపీని అడిగితే వెబ్ సైట్ లో చూసుకోవచ్చని సీబీఐ అధికారులు చెప్పారని కవిత పేర్కొన్నారు. వెబ్ సైట్ లో ఉన్న ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించిన నిందితుల జాబితాను తాను క్షుణ్నంగా పరిశీలించానని, దానిలో తన పేరు లేదని చెప్పారు.  తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని, దర్యాప్తునకు సహకరిస్తానని కవిత చెప్పారు. పైన పేర్కొన్న తేదీల్లో ఒక రోజు విచారణకు హాజరవుతానని లేఖలో తెలిపారు.
కాగా, సీబీఐ ఎఫ్ఐఆర్లో తన పేరులేదన్న కారణంతో ఎమ్మెల్యే కవిత విచారణకు హాజరుకానని చెప్పడం సరికాదని న్యాయవాది, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి  విస్మయం వ్యక్తం చేశారు. ఎఫ్ఐఆర్ లో పేరులేదని విచారణకు రాననడానికి వీల్లేదని ఆమె  స్పష్టం చేశారు. అసలు కవిత ఎవరి సలహా మేరకు సీబీఐకు లేఖ రాశారో అర్థం కావడంలేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తంచేశారు.
సీబీఐ కవితకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చిందని, ఆ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చేందుకు ఎఫ్ఐఆర్లో పేరు ఉండాల్సిన అవసరం లేదని ఆమె చెప్పారు. నేరానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారిని సెక్షన్ 160 కింద ప్రశ్నించే అవకాశముందని రచనా రెడ్డి చెప్పారు. సీబీఐ ఎమ్మెల్సీ కవితను సాక్షిగా విచారణకు పిలిచిందే తప్ప ఎఫ్ఐఆర్ లో పేరుందని ఎక్కడా చెప్పలేదని ఆమె స్పష్టం చేశారు.
సీఆర్పీసీ 160 కింద నోటీసు జారీ చేసినప్పుడు కచ్చితంగా హాజరుకావాల్సి ఉంటుందని రచనా రెడ్డి చెప్పారు. విచారణ అనంతరం ఆమె పేరును నిందితుల జాబితాలో చేర్చాలా వద్ద అన్న నిర్ణయం సీబీఐ తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ ఎఫ్ఐఆర్లో కవిత పేరుంటే 160 బదులుగా 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చే వారిని అన్నారు. నిందితులు, అనుమానితులకు మాత్రమే 41ఏ నోటీసులు ఇస్తారని చెప్పారు. నోటీసులు అందుకున్న వారు ఒకసారి విచారణకు గైర్హాజరైతే మరోసారి అవకాశమిస్తారని, అప్పుడు కూడా రాకపోతే సీబీఐ తదుపరి నిర్ణయం తీసుకుంటుందని రచనా రెడ్డి స్పష్టం చేశారు.