నేడు గుజరాత్ లో చివరి విడత పోలింగ్

ప్రతిష్టాకరంగా మారి, హోరాహోరీగా జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిదైన రెండో విడత పోలింగ్ నేడు జరుగుతున్నది. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉండగా  తొలి విడతలో 89 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మిగతా 93 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. 

మొదటి విడతలో 19 జిల్లాల్లో ఎన్నికలు జరిగితే, రెండో విడతలో  సెంట్రల్, నార్త్ గుజరాత్‌లోని 14 జిల్లాల్లో జరగనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తాయి. మొత్తం 833 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశలో 2.54 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 26,409 పోలింగ్ కేంద్రాల్ని సిద్ధం చేసింది. 36వేల ఈవీఎంలను వినియోగిస్తోంది.

రెండో దశలో కీలకమైన అహ్మదాబాద్, గాంధీనగర్, వడోదర, బనస్కాంత, పంచమహల్, అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉదయం 8.30కి అహ్మదాబాద్‌లో ఓటువేశారు. ఆదివారం  గాంధీనగర్‌ వెళ్లిన ఆయన తల్లి హీరాబెన్‌తో రెండు గంటలు గడిపి.. టీ తాగి.. పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.

సాధారణంగా పోలింగ్ శాతం తక్కువగా నమోదైతే అధికార పక్షానికి   అనుకూలంగా తీర్పు ఉంటుందనేది విశ్లేషకులు భావిస్తుంటారు. డిసెంబర్ 1న జరిగిన తొలివిడతలో 63.31 శాతం పోలింగే జరగడంతో  ప్రతిపక్ష కాంగ్రెస్, కేజ్రీవాల్ సారధ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఆందోళన చెందాయి. ఎలాగైనా ఓటర్లను పోలింగ్ బూత్‌కి తేవాలని రెండో దశపై ఎక్కువ దృష్టి సారించాయి.

బీజేపీ,  ఆప్ మొత్తం 93 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ 90 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని కూటమి భాగస్వామి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇతర పార్టీల్లో భారతీయ గిరిజన పార్టీ (బిటిపి) 12 మంది అభ్యర్థులను, బహుజన్ సమాజ్ పార్టీ  44 మంది అభ్యర్థులను నిలబెట్టింది. 285 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు.

దాదాపు అన్ని సర్వేలు చెప్పినట్లు మరోసారి బిజెపి  అధికారంలోకి వస్తే  ఈ ఫలితం కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి కలిసొస్తుంది. అలా కాకుండా ప్రతిపక్షాలకు అనుకూలంగా తీర్పు వస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి ఒకింత ఇబ్బందే. మోదీ సొంత రాష్ట్రంలో బీజేపీ ఓడిపోయిందనీ, దేశవ్యాప్తంగా కమలానికి ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ప్రతిపక్షాలు ప్రచారం చేసే ప్రమాదం ఉంటుంది. 

అందుకే ప్రధాని మోదీ అన్నీ తానై ఈ ఎన్నికల్లో విస్తృత ప్రచారం, ర్యాలీలు చేశారు. మొదటిసారిగా అభ్యర్థుల ఎంపికను సహిత స్వయంగా పర్యవేక్షించారు.  ఫలితాలు డిసెంబర్ 8న రానున్నాయి. అదే రోజు హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా వస్తాయి. 

ఆరు చోట్ల అసెంబ్లీ ఉప ఎన్నికలు 

కాగా, దేశంలో మెయిన్‌పురి లోక్ సభతో పాటు ఆరు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ సదర్, ఖతౌలీ, ఒడిశాలోని పదంపూర్, రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్, బీహార్‌లోని కుర్హానీ, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ సాగుతోంది.హోరాహోరీగా సాగుతున్న ఉప ఎన్నికల పర్వం ఆసక్తికరంగా మారింది.