బీజాపూర్‌ లో నలుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌ బీజాపూర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. వీరి నుంచి అమెరికా తయారీ ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిర్టూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోమ్రా అటవీ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు తెలుస్తున్నది.

మావోయిస్టు డివిజనల్ కమిటీ సభ్యుడు మోహన్ కడితి (40), మత్వరా కమిటీ సభ్యుడు రమేష్ (32), మహిళా మావోయిస్టు సుమితా (28), మరో మహిళా మృతి చెందారు.  ఎన్‌కౌంటర్‌ అనంతరం ఘటనాస్థలిలో యాంటీ నక్సల్‌ బలగాలు సోదా చేయగా అమెరికాలో తయారైన ఓ  తుపాకీ సహా నాలుగు ఆయుధాలు దొరికాయి. అమెరికా తయారీ పిస్టల్‌ను ఎం1 కార్బైన్‌ అని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, స్వాధీనం చేసుకున్న తుపాకీ సీరియల్ నంబర్ ఆధారంగా నక్సలైట్లు ఇంత అత్యాధునిక ఆయుధాన్ని ఎలా, ఎక్కడి నుంచి సంపాదించారనే దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. డిసెంబర్ 2011, ఏప్రిల్ 2014లో ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలోని రౌఘాట్, భానుప్రతాప్‌పూర్ ప్రాంతాల్లో ఎన్‌కౌంటర్ల అనంతరం భద్రతా దళాలు ‘మేడ్ ఇన్ యూఎస్‌ఏ’ గుర్తులతో కూడిన రెండు 7.65 ఎంఎం ఆటోమేటిక్ పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నాయని అధికారులు తెలిపారు.

2018 లో సుక్మా జిల్లాలో ఎదురుకాల్పుల తర్వాత ‘మేడ్ ఇన్ జర్మనీ’ అని రాసి ఉన్న రైఫిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలు యూఎస్‌ మేడ్‌ సబ్ మెషిన్ గన్‌ను స్వాధీనపర్చుకున్నారు.