హ్యాకర్ల బారిన సఫ్దర్ జంగ్, శ్రీ చరణ్ ఆసుపత్రులు

దేశ రాజధానిలో ప్రధాన వైద్య సంస్థలు సైబర్ దాడులకు గురవుతున్నాయి. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోని ఐదు సర్వర్లపై హ్యాకింగ్ దాడి జరిగి ఇంకా పరిస్థితి చక్కబడక ముందే ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆసుపత్రితో పాటు తమిళనాడులో మరో ఆసుపత్రి కూడా హ్యాకర్ల బారిన పడిన విషయం వెలుగు చూసింది. 

అయితే, ఈ సైబర్ దాడిలో ఎయిమ్స్‌కు జరిగిన నష్ట తీవ్రత కంటే సఫ్దర్ జంగ్ ఆసుపత్రికి జరిగిన తీవ్రత తక్కువేనని చెబుతున్నారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో మాన్యువల్ తరహాలో గరిష్ట సేవలు అందిస్తుండటంతో డాటా లీక్ తక్కువేనని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై జరిగిన సైబర్ దాడి మరీ అంత తీవ్రం కాదని, ఆసుపత్రి సర్వర్‌లోని కొన్ని సెక్షన్లపై సైబర్ దాడి ప్రభావం ఉందని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ బి.ఎల్.షేర్వాల్ తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఆసుపత్రి సర్వర్‌పై హ్యాకర్లు దాడి చేశారని, ఒకరోజు సర్వర్ డౌన్ అయిందని ఆయన చెప్పారు. 

సమస్యను వెంటనే ఆసుపత్రి టీమ్‌తో కలిసి ఎన్ఐసీ టీమ్ సరిచేసిందని, ప్రస్తుతం ఆసుపత్రి సేవలు సజావుగా జరుగుతున్నాయని, డాటా సురక్షితంగానే ఉందని తెలిపారు.

అదే విధంగా, తమిళనాడు లోని శ్రీశరణ్ మెడికల్ సెంటర్ ఆస్పత్రికి చెందిన దాదాపు లక్షన్నర మంది రోగుల డేటాను ఆన్‌లైన్‌లో విక్రయించినట్టు తెలుస్తోంది. సైబర్ ముప్పులను అంచనా వేసే క్లౌడ్‌సెక్ అనే సంస్థ ఈ ఉదంతాన్ని బయటపెట్టింది. 2007-2011 మధ్య ఈ ఆస్పత్రికి వెళ్లిన రోగుల పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా, గార్డియన్ పేరు, వైద్యుల వివరాలను హ్యాకర్లు సైబర్ క్రైమ్ ఫోరమ్‌ల్లో 100 డాలర్ల నుంచి 400 డాలర్ల చొప్పున విక్రయించినట్టు క్లౌడ్‌సెక్ వెల్లడించింది.