ఢిల్లీ ఎయిమ్స్ సర్వర్ల హ్యాకింగ్ చైనా హ్యాకర్ల పనా!

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) సర్వర్ల హ్యాకింగ్  చైనా హ్యాకర్ల పనేనంటూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. సర్వర్ల హ్యాకింగ్ ప్రభావం ఇప్పటికీ ఎయిమ్స్‌‌లో కనిపిస్తుండగా, ప్రస్తుతం మాన్యువల్ తరహాలో సేవలు కొనసాగిస్తున్నారు.
చైనాకు చెందిన రెండు రాన్‌సమ్‌వేర్ (కంప్యూటర్ వైరస్) గ్రూపులు `ఎంపరర్ డ్రాగన్ ఫ్లై’, `బ్రోన్జ్ స్టార్లైట్’ (దేవ్-0401)లు   ప్రపంచవ్యాప్తంగా ఫార్మా సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరుపుతున్నట్టు సైబర్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్ల హ్యాకింగ్ ఘటనలో ఈ గ్రూపుల ప్రమేయం ఉందా అనేది ఇంకా ధ్రువీకరణ కావాల్సి ఉంది. లైఫ్  అనే మరో సంస్థను కూడా కూడా సైబర్ నిపుణులు అనుమానిస్తున్నారు.
ఎయిమ్స్‌లో ఈనెల 23న తొలిసారి సర్వర్లు మొరాయించినట్టు గుర్తించగా, ఇందులో 3 నుంచి 4 కోట్ల మంది రోగుల సమాచారం ఉన్నట్టు ఒక అంచనా. వీవీఐపీలు, రాజకీయ నేతలు, సెలబ్రెటీల సమాచారం కూడా ఇందులో ఉందంటున్నారు. హ్యాకింగ్ కారణంగా ఈ డాటా ప్రమాదంలో పడిందని, ఈ డాటాను హ్యాకర్లు డార్క్‌ వెబ్‌లో అమ్మకానికి పెట్టే అవకాశం ఉందని అనుమానాలు ఉన్నాయి.
అయితే, ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం ఐదు ప్రధాన సర్వర్లు సైబర్ దాడికి గురయ్యాయని, ఇందులో ఒక సర్వర్‌ను హాంకాంగ్ నుంచి హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. సైబర్ దాడికి గురైన సర్వర్ల మిర్రర్ ఇమేజ్‌లు ఫోరెన్సిక్ ల్యాబ్ విశ్లేషణకు పంపినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.
ఎయిమ్స్ అడ్మినిస్ట్రేషన్, ఇతర ఏజెన్సీలు ఆయా సర్వర్లను పునరుద్ధరించి, తిరగి సేవలందించే ప్రక్రియ సాగిస్తున్నారు. కాగా, హ్యాకర్లు రూ.200 కోట్లు క్రిప్టో కరెన్సీ రూపంలో చెల్లించాలని డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.  అయితే, ఆ విషయం ఏదీ తమ దృష్టికి ఎయిమ్స్ అధికారులు తీసుకురాలేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
ఎయిమ్స్ సెక్యూరిటీ అధికారి ఫిర్యాదు మేరకు బలవంతపు వసూళ్లు, సైబర్ టెర్రరిజం కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు సర్వర్ల హ్యాకింగ్ ద్వారా జరిగిన నష్టాన్ని సాధ్యమైనంత తగ్గించేందుకు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, సెంటర్ ఫర్ డవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అండ్ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, రెండు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తలమునకలవుతున్నాయి.
దొంగిలించిన డేటాను డార్క్ వెబ్‌లో విక్రయించారని, లక్షలాది మంది రోగుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రమాదంలో పడేస్తుందని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ (ఐఎఫ్ఎస్ఓ) వర్గాలు నివేదించాయి. మొదటిసారిగా హ్యాకింగ్ కేసును డీల్ చేస్తున్న ఐఎఫ్ఎస్ఓ అధికారులు, డేటా ఏదీ కోల్పోలేదని భావిస్తున్నారు. 
 
వారి ప్రకారం, డబ్బు డిమాండ్ చేయడమే హ్యాకర్ల ప్రాథమిక లక్ష్యం. ఎయిమ్స్ నుండి 200 కోట్ల క్రిప్టోకరెన్సీని హ్యాకర్లు డిమాండ్ చేశారని కధనాలు వెలువడినా, ఢిల్లీ పోలీసులు నిర్ధారింపలేదు. దొంగిలించిన ఎయిమ్స్  డేటా కోసం 1,600 కంటే ఎక్కువ సెర్చ్ లు డార్క్ వెబ్‌లో కనుగొన్నారు. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలతో సహా వీవీఐపీల సమాచారం చోరీకి గురైంది.

ఎయిమ్స్ నెట్‌వర్క్ ప్రస్తుతం క్లీన్‌ప్ చేయబడుతోంది. 5,000 కంప్యూటర్లలో 1,200 కంప్యూటర్లలో యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేశారు. 50 సర్వర్‌లలో 20ని క్రమం తప్పకుండా స్కాన్ చేస్తున్నారు.  నిక్ ఇ- హాస్పిటల్ డాటా‌బేస్, ఇ-హాస్పిటల్ అప్లికేషన్ సర్వర్లను చాలవరకూ పునరుద్దరించారు. ఈ ఆపరేషన్ రెస్టోర్ సర్వీర్ వచ్చే వారం వరకూ కొనసాగనున్నట్టు అధికారులు తెలిపారు.