తృణమూల్ నేత ఇంట్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తూర్పు మేదినీపూర్ నియోజకవర్గంలో టిఎంసి నేత ఇంట్లో బాంబు పేలుడు సంభవించింది. ఈ పేలుళ్లలో ముగ్గురు మృతి చెందారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. 
 
టిఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ శనివారం చేపట్టనున్న ర్యాలీ వేదికకు 1.5 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. తూర్పూ మేదీనిపూర్ జిల్లా భూపతి నగర్‌లో టిఎంసి నేత ఇంట్లో శుక్రవారం అర్థ రాత్రి పేలుడు జరగడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. 
 
ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానినకి చేరుకొని ఇంట్లోకి బాంబులు ఎలా వచ్చాయనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 
 
తూర్పు మేదినీపూర్‌లోని భూపతినగర్‌లో గల తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బూత్‌ ప్రెసిడెంట్ రాజ్‌కుమార్‌ మన్న ఇంట్లో బాంబు పేలింది. శుక్రవారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో బాంబు పేలుడు ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో రాజ్‌కుమార్‌తోపాటు మరో ఇద్దరు చనిపోయారు.
 
 “ఈ పేలుడుకు సంబంధించిన కారణాలు తెలియ లేదు. దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సంఘటనలో గడ్డితో కప్పబడిన మట్టి ఇల్లు ఎగిరిపోయింది” అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
 పేలుడుకు గల కారణాలు తెలియాల్సి వుంది. ఆ నివాసంలోకి బాంబులు ఎలా వచ్చాయన్న అంశంపై దర్యాప్తు చేపడుతున్నట్లు  తెలిపారు. ఈ విషయంలో బీజేపీ విమర్శలు గుప్పించింది. తృణమూల్ నాయకుడి ఇంటి దగ్గర నాటు బాంబులు తయారవుతున్నాయని, అందుకే ఇది జరిగిందని బీజేపీ ఆరోపించింది.
 
ఈ ఘటనకు టీఎంసీనే కారణమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు దిలీఫ్ ఘోష్ ఆరోపించారు. రాష్ట్రం బాంబుల తయారీ పరిశ్రమగా తయారయిందని మండిపడ్డారు.