డిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్యెల్సీ కవిత…  ఈడీ స్పష్టం 

కొంత కాలంగా తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎట్టకేలకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రస్తావించింది.  అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు బయటపెట్టిన కీలక అంశాలలో ఆమె పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.   
 
ఇంతకాలం ఈ కేసులో కవిత పాత్ర ఉందంటూ మీడియా కధనాలు వెలువడటమే గాని, మొదటిసారిగా సీబీఐ ప్రత్యేక కోర్టుకు సమర్పించిన ఓ రిమాండ్‌ రిపోర్ట్‌లో కవిత పాత్ర గురించి స్పష్టమైన సమాచారం వెల్లడించింది. ఆమెతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల పాత్ర గురించి కూడా పేర్కొన్నారు.  
 
ఆప్ నేతలకు రూ. 100 కోట్ల ముడుపులను సౌత్‌గ్రూప్ చెల్లించినట్టు పేర్కొన్న ఈడీ ఈ మొత్తాన్ని సమకూర్చిన వారిలో కవిత పేరును కూడా చేర్చింది. సౌత్ గ్రూప్‌ను శరత్ రెడ్డి, కవిత, మాగుంట శ్రీనివాసులురెడ్డి నియంత్రించారని ఈడీ తెలిపింది. సౌత్‌గ్రూప్ ద్వారా రూ. 100 కోట్లను విజయ్‌ నాయర్‌కు చేర్చినట్టు వెల్లడించింది. 
 
దర్యాప్తులో ఇచ్చిన వాంగ్మూలంలో అమిత్ అరోరా ధ్రువీకరించారని ఈడీ రిమాండ్ రిపోర్ట్ పేర్కొంది. ఆప్ నేతల తరపున విజయ్ నాయర్ ఈ మొత్తాన్ని తీసుకున్నట్టు ఈడీ ప్రస్తావించింది. ఈ రిపోర్ట్‌లో కవిత పేరుతోపాటు వైసిపి  ఎంపీగా ఉన్న లిక్కర్ వ్యాపారి మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు కూడా తెరపైకి రావడం గమనార్హం.
 
2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు కవిత 10 ఫోన్లు మార్చారని అంటూ ఆ 10 ఫోన్ల ఐఎంఇఐ  నెంబర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ అధికారులు ప్రస్తావించారు.  అయితే 2021 సెప్టెంబరు 1వ తేదీన  ఒకేరోజు ఎమ్మెల్సీ కవిత, బోయినపల్లి అభిషేక్ రావు, సీఏ బుచ్చిబాబు ఫోన్లు మార్చినట్లు పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దాదాపు 36 మంది నిందితులు/అనుమానితులు ఉన్నారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో ఈడీ పేర్కొంది.  వారందరూ దాదాపు 170 ఫోన్లను వినియోగించారని.. అయితే వాటిలో కేవలం 17 ఫోన్లే తమకు దొరికాయని ఈడీ తెలిపింది.   అమిత్ అరోరా వాడిన 11 ఫోన్లను, ఎమ్మెల్సీ కవిత వాడిన 10 ఫోన్లను ఆధారాలు దొరకకుండా ధ్వంసం చేశారని పేర్కొంది. ఈ కేసులో ధ్వంసమైన  153 ఫోన్ల విలువ దాదాపు రూ.1.38 కోట్లు ఉంటుందని ఈడీ అంచనా వేసింది.
అధికారులు బుధవారం ఉదయం గుర్గావ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అమిత్ అరోరాను అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడిగా తెలుస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో అదుపులోకి అమిత్ అరోరాను అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
 
వారం రోజుల కస్టడీకి అమిత్ అరోరా 
అర్జున్ పాండే, దినేశ్ అరోరా, అమిత్ అరోరా సిసోడియాకు అత్యంత సన్నిహితులు కాగా.. వీరిలో దినేశ్ అరోరా సీబీఐ కేసులో అప్రూవర్గా మారాడు. అధికారులు అతడి స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు.  అమిత్ అరోరాను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ హాజరుపరిచి 14 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది.
 
అయితే 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈ కేసులో చేతులు మార్చి, ముడుపులు అందించిన పాత్రలో అమిత్ అరోరా ఉన్నట్లు ఈడీ కోర్టుకు తెలిపింది. మరోవైపు ఈ కేసులో  సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్పై వాదనలు ముగిశాయి. ఛార్జీ షీటును పరిశీలించిన రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఇరు పక్షాల వాదనలు విన్నారు. 
 
అనంతరం కేసు విచారణను డిసెంబర్ 15వ తేదీకి వాయిదా వేశారు. ఈ నెల 25న ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో సీబీఐ తొలి చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆప్‌ నేత విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయిన్‌పల్లితో సహా ఏడుగురు నిందితులపై అభియోగాలు మోపుతూ 10వేల పేజీల ఛార్జిషీట్‌ ను రౌస్‌ అవెన్యూ కోర్టులో ఫైల్‌ చేసింది.
 
 ఏ1గా ఎక్సైజ్‌ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ నరేంద్ర సింగ్‌, ఏ2గా ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ కుల్‌దీప్‌ సింగ్‌, ఏ3గా అభిషేక్‌ బోయిన్‌పల్లి, ఏ4గా విజయ్‌ నాయర్‌, ఏ5గా అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ఏ6గా సమీర్‌ మహేంద్రు, ఏ7గా ముత్తా గౌతమ్‌ పేర్లను చేర్చింది.