విజయ్ దేవరకొండకు `లైగర్‌’లో పారితోషికంపై ఈడీ ప్రశ్నలు

 
‘‘లైగర్‌ సినిమాలో నటించినందుకు మీకు అందిన పారితోషికం ఎంత? ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన ప్రపంచ బాక్సింగ్‌ వీరుడు మైక్‌టైసన్‌కు ఎంతిచ్చారు? ఇతరులకు జరిపిన చెల్లింపుల సంగతేంటి??’’ అంటూ సినీ నటుడు విజయ్‌ దేవరకొండపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు.
 
 లైగర్‌ చిత్రం నిర్మాణానికి సంబంధించిన పెట్టుబడుల వ్యవహారంలో ఫెమా నిబంధనలను అతిక్రమించారనే ఆరోపణలపై ఈడీ విచారణ ప్రారంభించింది. ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాత్‌, సహ నిర్మాత, నటి చార్మీని ఈడీ ఇప్పటికే విచారించింది.  ఈడీ తన దర్యాప్తులో భాగంగా విజయ్‌ దేవరకొండకు ఇటీవల నోటీసులు జారీ చేయగా.. బుధవారం ఆయన తన మేనేజర్‌ అనురాగ్‌తో కలిసి ఈడీ ఎదుట హాజరయ్యారు.
 
ఉదయం 9 గంటల నుంచి ‘సాయంత్రం చీకటి పడేవరకు విచారణ కొనసాగింది. విజయ్‌కు సంబంధించిన రెండు బ్యాంకు అకౌంట్ల లావాదేవీలపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. లైగర్‌ సినిమా చిత్ర సంస్థ ఎంత పారితోషకం ఇచ్చిందన్న అంశాలపై ఈడీ కూపీ లాగినట్లు సమాచారం.
 ఈ సినిమాలో పెట్టుబడులు.. పారితోషకాలు, చెల్లింపులు, సినిమా వసూళ్లు తదితర అంశాలపై ఆయనను సుదీర్ఘంగా విచారించారు. ఒకప్పుటి బాక్సింగ్‌ లెజెండ్‌ మైక్‌టైసన్‌కు కూడా ఈడీ నోటీసులు జారీచేసే అవకాశాలున్నాయి. 
 
లైగర్‌ సినిమాలో రాజకీయ నాయకులు అక్రమ పద్ధతిలో పెట్టుబడులు పెట్టారని.. పెద్దమొత్తంలో దుబాయ్‌కి తరలించి.. అక్కడి నుంచి పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కోణంపైనా విజయ్‌ దేవరకొండను ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఓ రాజకీయ నేత ప్రమేయం కూడా ఉన్నట్లు ఈడీ అనుమానిస్తోంది.