ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో సిట్‌‌ వాదనను తప్పుబట్టిన బీజేపీ

టీఆర్ఎస్​ ప్రభుత్వాన్ని కూల్చేందుకే బీజేపీ నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నాలు చేసిందన్న సిట్‌‌ వాదనను బీజేపీ తప్పుబట్టింది. 104 మంది ఎమ్మెల్యేలతో టీఆర్‌‌ఎస్‌‌ పార్టీ అధికారంలో ఉందని, ముగ్గురు నలుగురు పార్టీ మారితే ప్రభుత్వం ఎలా పడిపోతుందని నిలదీసింది. 
 
రాజకీయ కుట్రతోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును ముందుకు నడిపిస్తున్నారని ఆరోపించింది. ప్రభుత్వ కనుసన్నల్లోనే సిట్‌‌తో దర్యాప్తు జరుగుతోందని వాదించింది.  ఈ కేసులో సిట్‌‌ దర్యాప్తు వద్దని, సీబీఐతో దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  జి.ప్రేమేందర్‌‌రెడ్డి, కేసులోని ముగ్గురు నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజి, ఇతరులు వేసిన రిట్లపై బుధవారం జస్టిస్‌‌విజయ్‌‌సేన్‌‌రెడ్డి విచారణ జరిపారు.
నిందితుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌‌ అడ్వకేట్‌‌ మహేశ్ ​జఠ్మలానీ వాదిస్తూ ముగ్గురు నిందితులకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేశారు. నేరారోపణలకు ఆధారా ల్లేవని, ఇక్కడ వర్తించే విధంగా లేవని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను ఎందుకు కొనేందుకు ప్రయత్నించారో కూడా చెప్పలేదని తెలిపారు.
104 మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ నుంచి నలుగురు బయటకు వస్తే ప్రభుత్వం ఎలా కూలిపోతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ఎలా కూల్చగలరని అడిగారు. కాబట్టి ముగ్గురిపై పెట్టిన కేసులకు చట్టబద్ధత లేదని స్పష్టం చేశారు.
 
రాజకీయ కోణంలోనే ఈ కేసును నమోదు చేశారని పేర్కొంటూ దర్యాప్తు అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, కానీ దర్యాప్తు ఆ విధంగా జరగడం లేదని వాదించారు.  సిట్ దర్యాప్తు వివరాలు మీడియాకు లీకు అవుతున్నాయని గుర్తు చేశారు. దర్యాప్తు ఎలా జరగాలో పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పులను   మహేష్ జెఠ్మలానీ ప్రస్తావించారు. 
 
41ఎ సిఆర్పిసి నోటీసులకు సమాధానం ఇవ్వకుండా లుక్ ఔట్ నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ కేసులో పలు ఉల్లంఘనలు జరిగాయని  మహేష్ జెఠ్మలానీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.   బీజేపీని లక్ష్యంగా చేసుకుని సిట్‌‌ దర్యాప్తు చేస్తోందని బీజేపీ తరఫు న్యాయవాది​ స్పష్టం చేశారు.
 సీజేఐ, హైకోర్టు సీజేలకు సీఎం సీడీలు, పెన్‌‌డ్రైవ్‌‌లు పంపడాన్ని బట్టి కేసులో ప్రభుత్వ ఉద్దేశం కనబడుతోందని పేర్కొన్నారు. వెంటనే ఈ కేసును సిట్‌‌ నుంచి సీబీఐకి బదిలీ చేయాలని ఆయన కోరారు. దర్యాప్తు పారదర్శకంగా  జరగడం లేదని చెప్పారు. అయితే, సిట్‌‌ తరఫు సీనియర్‌‌ అడ్వకేట్‌‌ దుష్యంత్‌‌ దవే వాదిస్తూ, సిట్‌‌ దర్యాప్తు బాగా జరుగుతోందని, ఎంతోమందికి లింక్స్‌‌ ఉన్నాయని చెబుతూ సిట్‌‌ నుంచి సీబీఐకి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పారు. మిగిలిన అన్ని కేసుల విచారణ 6కు వాయిదా పడింది.