సరిహద్దుల్లో భారత్‌, అమెరికా సైనిక విన్యాసాలపై చైనా ఉలిక్కిపాటు

భారత్‌, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) సమీపంలో భారత్‌, అమెరికా కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. అయితే దీనిపై చైనా ఉలిక్కిపాటు పడుతున్నది. భారత్‌, అమెరికా సంయుక్త సైనిక వ్యాయామం ‘యుధ్ అభ్యాస్’ 18వ ఎడిషన్ ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో జరుగుతున్నది.
భారత్‌, చైనా సరిహద్దులోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసీ) నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ప్రారంభమైన ఈ సైనిక విన్యాసాలు రెండు వారాలు కొనసాగనున్నాయి. శాంతి పరిరక్షణ, విపత్తు సహాయక చర్యల్లో ఇరు దేశ సైన్యాల మధ్య పరస్పర సహకారం, నైపుణ్యాన్ని అందిపుచ్చుకునేందుకు సంయుక్త ఆర్మీ డ్రిల్‌ జరుగుతున్నది.
కాగా, ఎల్‌ఏసీ సమీపంలో భారత్‌, అమెరికా సైనికుల సంయుక్త విన్యాసాలపై చైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. 1993, 1996లో భారత్‌, చైనా మధ్య జరిగిన ఒప్పందాల స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. పాకిస్థాన్‌ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ ఈ మేరకు సమాధానమిచ్చారు. భారత్‌, చైనా మధ్య పరస్పర విశ్వాసానికి ఈ విన్యాసాలు వ్యతిరేకమని అన్నారు.

మరోవైపు ఈ ఒప్పందాలను ఉల్లంఘించిన చైనా 2020 మేలో లడఖ్‌లోని గాల్వాన్‌ లోయ వద్ద భారీగా సైనికులను మోహరించింది. కీలకమైన సైనిక స్థావరాలను ఆక్రమించేందుకు ప్రయత్నించింది. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. దీంతో సరిహద్దులో ఉద్రిక్తతలు తీవ్రం కావడంతో భారత్‌, చైనా పోటాపోటీగా సైనిక బలగాలను మోహరించాయి. అయితే అనంతరం పలు దఫాలుగా జరిగిన సైనిక చర్చల్లో భాగంగా బలగాలను వెనక్కి మళ్లించాయి.

భారత్ లక్ష్యంగా చైనా సైనిక స్థావరాలు 
 
 మరోవంక, భారత్‌ను లక్ష్యంగా చేసుకొని చైనా తొలిసారిగా విదేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేస్తోంది. హిందూ మహా సముద్రంలో భారీ యుద్ధ నౌకలు, విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు మోహరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఆఫ్రికా ఖండంలోని జిబౌటి దేశంలో ప్రప్రథమ విదేశీ స్థావరాన్ని ఏర్పాటు చేస్తోంది. ఉపగ్రహాలతో పరిశీలించిన అనంతరం ఈ విషయాన్ని అమెరికా రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. 
 
ఇథియోపియా, సోమాలియా దేశాల సరిహద్దులుగా గలజిబౌటి దేశాన్ని ‘ఆఫ్రికా కొమ్ము’గా వ్యవహరిస్తుంటారు. అక్కడ చైనా సైనిక స్థావరాన్ని ఏర్పాటుకు 14 ఏళ్ల క్రితమే ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి నుంచి ఒక్కొక్కటిగా ఆయుధాలను తరలిస్తోంది. ఇవన్నీ భారత్‌పై గురిపెట్టడానికేనని అమెరికా అంచనా వేస్తోంది.

అమెరికా జోక్యంపై చైనా హెచ్చరిక

ఇలా ఉండగా,  భారత దేశంతో తన సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను చైనా హెచ్చరించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అమెరికాతో భారత దేశం మరింత సన్నిహితమయ్యే పరిస్థితులు ఏర్పడకుండా నిరోధించాలని చైనా కోరుకుంటోంది. ఈ వివరాలను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్ తాజా నివేదిక వెల్లడించింది. ఈ నివేదికను మంగళవారం అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించింది.

తూర్పు లడఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలను తక్కువ చేసి చూపించడానికి చైనా అధికారులు ప్రయత్నించారని ఈ నివేదిక పేర్కొంది. సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకుంటూ, భారత దేశంతో ఇతర ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని చైనా కోరుకున్నట్లు తెలిపింది.

చైనీస్ మిలిటరీపై ఇచ్చిన ఈ నివేదికలో ‘చైనా-భారత్ సరిహద్దు’ అనే విభాగంలో, సరిహద్దుల్లోని ఉద్రిక్తతలు అమెరికాతో భారత దేశం మరింత సన్నిహిత భాగస్వామ్యానికి కారణమవడాన్ని నిరోధించాలని చైనా కోరుకుందని పెంటగాన్ తెలిపింది.