మల్లారెడ్డి కేసును దర్యాప్తు చేయమని ఈడీకి ఐటీ శాఖ లేఖ

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలు, కాలేజీలపై ఐటీ రైడ్స్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ లేఖ రాసింది. మెడికల్ సీట్లు, డొనేషన్ల విషయంలో మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారని గుర్తించామని తెలిపింది. 
 
దీనిపై పూర్తి దర్యాప్తు చేయాలని ఈడీని కోరింది. మనీలాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు జరపాలని సూచించింది. ఈడీ విచారణ జరిగితే అవకతవకలకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొంది. తాము ఇప్పటి వరకు నిర్వహించిన సోదాల్లో సేకరించిన ఆధారాలను కూడా ఈడీకి ఐటీ శాఖ పంపించింది.
ఈమేరకు  తాము జరిపిన సోదాలకు సంబంధించిన పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ శాఖ లేఖ రాసింది. నవంబరు నెల మూడో వారంలో రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డి ఇండ్లు, ఆఫీసులు, కాలేజీలతో పాటు ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. భారీగా నగదుతో పాటు కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
 ఈ క్రమంలో నవంబర్ 28న విచారణకు హాజరు కావాలని మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఉద్యోగులకు నోటీసులు ఇచ్చారు.నవంబరు 28న తొలి రోజు ఐటీ విచారణకు హాజరైన వారిలో మంత్రి మల్లారెడ్డి తమ్ముడు గోపాల్ రెడ్డి, కుమారుడు భద్రారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి,  ఎంఎల్ఆర్ఐటి కాలేజీ ఛైర్మన్ లక్ష్మణ్ రెడ్డి, మల్లారెడ్డి విద్యాసంస్థలకు చెందిన శివకుమార్ రెడ్డి, నర్సింహారెడ్డి, త్రిశూల్ రెడ్డి, మెడికల్ కాలేజీ డైరెక్టర్ రామస్వామిరెడ్డి తదితరులు ఉన్నారు.
నవంబరు 29న రెండో రోజు ఐటీ విచారణకు హాజరైన వారిలో ఎక్కువ మంది మంత్రి మల్లారెడ్డికి చెందిన మెడికల్‌, ఇంజనీరింగ్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌, అకౌంటెంట్లే ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి ఆడిటర్‌ సీతారామయ్యను ఐటీ అధికారులు 4 గంటలపాటు విచారించారు. రెండో రోజు విచారణలో ఐటీ అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలిసింది.
సీజ్ చేసిన డబ్బు, డాక్యుమెంట్స్, బ్యాంక్ లాకర్లు వీటన్నింటికి సంబంధించి అధికారులు ఈడీకి లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈడీ కూడా త్వరలో రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మల్లారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాల్లో భారీగా‌ నగదు సీజ్‌ చేశారు. రూ.18.50 కోట్లు, 15 కిలోల బంగారు ఆభరణాలు సీజ్‌ చేశారు. అలాగే మల్లారెడ్డి ఆస్తులకు సంబంధించిన కీలకపత్రాలు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని బ్యాంక్‌ లాకర్లను ఐటీ అధికారులు ఓపెన్ చేయనున్నారు.