వైఎస్ షర్మిలను అరెస్ట్ .. వైఎస్ విజయమ్మ హౌస్ అరెస్ట్

ప్రగతి భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారడంతో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిలను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె అమ్మగారైన వైఎస్ విజయమ్మను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్సార్ నగర్ పీఎస్ లో ఉన్న షర్మిలను చూడటానికి బయల్దేరిన విజయమ్మను లోటస్ పాండ్ దగ్గర పోలీసులు అడ్డుకుని  హౌస్ అరెస్ట్ చేశారు.
 
సోమవారం వరంగల్ లో షర్మిల పై దాడి ఘటన, మంగళవారం షర్మిల కారును క్రేన్ తో ఈడ్చుకెళ్లడంతో విజయమ్మ కలత చెందినట్లు తెలుస్తోంది. షర్మిలపై దాడితో ఆమె నిన్నటి నుంచి  మంచినీళ్లు కూడా ముట్టడం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు.  పోలీసులు దురహంకారంగా వ్యవహరిస్తున్నారని విజయమ్మ విమర్శించారు. తన కూతురు షర్మిల దగ్గరకు వెళ్లతుంటే పోలీసులు అడ్డుకున్నారంటూ విజయమ్మ నిరాహార దీక్షకు దిగారు.
 
నిన్న వరంగల్ లో బస్సుకు నిప్పుపెట్టిన టీఆర్ఎస్ వైఖరికి నిరసనగా ఇవాళ ప్రగతి భవన్ ముట్టడికి వైఎస్ షర్మిల పిలుపునిచ్చింది.  ప్రగతిభవన్‌ ముట్టడికి  కారులో వెళ్తున్న ఆమెను  పంజాగుట్ట చౌరస్తా వద్ద పోలీసులు అడ్డుకున్నారు.  షర్మిల, పోలీసుల మధ్య వాగ్వాదంతో పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయినా ఆమె కారు నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరించారు.
 
దీంతో ట్రాఫిక్ జామ్, శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపిన పోలీసులు… టోయింగ్ వెహికిల్ రప్పించి షర్మిల కారులో ఉండగానే దాన్ని ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  పోలీసుల వైఖరిపై వైఎస్సార్ టీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఆమెను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
 
ఉదయం ప్రగతి భవన్ ముట్టడికి బయలుదేరిన షర్మిలను పంజాగుట్ట వద్ద అడ్డుకుని ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  షర్మిల తో పాటు మరో 20 మందిని పోలీసులు పీఎస్ లో నిర్భందించారు. మొబైల్ ఫోన్స్ లాక్కుని పీఎస్ లోనే కూర్చోబెట్టారు. ట్రాఫిక్ కు అంతరాయం కల్గించారని  షర్మిల పై పంజాగుట్ట పీఎస్ లో మూడు సెక్షన్ల కింద  పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవంక, నర్సంపేట పోలీసులు అనుమతి రద్దు చేశారని  పేర్కొంటూ వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దానితో  పాదయాత్ర కోసం తాజాగా దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. అనంతంరం వైఎస్ షర్మిల పాదయాత్రకు అనుమతివ్వాలని కోర్టు, పోలీసులను ఆదేశించింది. అయితే సీఎం కేసీఆర్ పై మతపరమైన, రాజకీయ అంశాలపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.