అవినీతి లేని ఏకైక రంగం సినీరంగం.. చిరంజీవి

అవినీతి లేని ఏకైక రంగం సినీ రంగం అని, ఇక్కడ ప్రతిభ ఉంటేనే ఎదుగుతాం అని టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి భావోద్వేగంతో చెప్పారు. గోవాలో 53వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ముగింపు సందర్భంగా ప్రతిష్టాకరమైన ఇండియన్ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌-2022 పురస్కారంను ఆయన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ నుండి సోమవారం స్వీకరించారు.
 
“కొనేళ్ల క్రితం ఇదే వేదికపై జరిగిన అవార్డు ఫంక్షన్‌లో దక్షిణాదికి చెందిన ఒక్క హీరో ఫొటో కూడా లేకపోవడం చూసి చాలా బాధపడ్డా. ఇప్పుడు ఇదే వేదికపై నాకు ఈ అవార్డు ఇచ్చినందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఇదొక ప్రత్యేకమైన అవార్డు. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా. సరైన సమయంలోనే నాకు ఇచ్చారనుకుంటున్నా” అని తెలిపారు.
 
ఈ అవార్డు తన అభిమానుల్లో నూతనోత్సాహం నింపిందని చెబుతూ “నేను ఎప్పుడూ మీతోనే ఉంటా.. నా చివరి శ్వాస వరకు సినిమాల నుంచి తప్పుకొను” అంటూ వారికి భరోసా ఇచ్చారు.  తెలుగు ప్రజల ప్రేమనే తనను ఇక్కడి దాకా తీసుకొచ్చిందని తెలిపారు. ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు అని చెప్పారు.
 
ప్రస్తుతం ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చిందని సంతోషం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో భారతీయ సినిమా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షిస్తున్నా అని చిరంజీవి తెలిపారు. తనను ఆదరిస్తున్న అందరికీ జీవితాంతం కృతజ్ఞతగా ఉంటా అని చెప్పారు.
 
ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన శివశంకర ప్రసాద్ అనే తనకు సినీ పరిశ్రమ మరో జన్మనిచ్చిందని చిరంజీవి పేర్కొన్నారు. రాజకీయాల్లోకి వెళ్లడం కారణంగా కాస్త గ్యాప్ వచ్చిందని తెలిపారు. రాజకీయాలలోకి వెళ్లడం వల్లనే తనకు సినిమా విలువేంటో తెలిసిందని చెప్పడం గమనార్హం.
 
‘‘ఇప్పుడు ట్రెండ్‌ మారింది. కంటెంట్‌ మారుతుంది. కొత్త హీరోలు చాలామంది వచ్చారు. ఆ హీరోలు నాకు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. వాళ్లకు ఇప్పుడు కష్టకాలమే’’ అని చిరంజీవి నవ్వుతూ చెప్పారు.  నాలుగు దశాబ్దాలుగా నటుడిగా, డ్యాన్సర్‌గా, నిర్మాతగా 150కిపైగా సినిమాలు చేసి..అద్బుతమైన నటనతో అందరి మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకుని.. తెలుగు సినీ పరిశ్రమలో విశేష ప్రజాదరణతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు చిరంజీవి.