వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదు

తెలంగాణలో కేసీఆర్ పతనం ప్రారంభమైందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఐదవ విడత పాదయాత్ర సందర్భంగా భైంసాకు సమీపంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని తేల్చి చెప్పారు.
 
ప్రధాని మోదీ వస్తే ఫామ్ హౌస్ లో దాక్కునే కేసీఆర్ ప్రధానిని గద్దె దించుతాడనడం హాస్యాస్పదమని కొట్టిపారవేసారు. వెయ్యి మంది కేసీఆర్ లు, ఓవైసిలు వచ్చినా, వెయ్యి బీఆర్ఎస్ పార్టీలు పెట్టినా 3వ సారీ ప్రధాని మోదీనే అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబం భరతం పట్టి, అక్రమాస్తులను పేదలకు పంచి పెడుతామని వెల్లడించారు.
 
దళిత బంధు ఈటెల రాజేందర్ వల్లే వచ్చిందని, లబ్ధిదారులు ఈటల, మోదీ ఫొటోలు పెట్టుకోవాలని  చెప్పారు. బీఆర్ఎస్ పేరుతో వైఫల్యాలపై ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్న కిషన్ రెడ్ సంగ్రామ యాత్రకు ప్రజలు దీవించి అండగా ఉండాలని కోరారు.
 
తెలంగాణలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా తాము సిద్దమేనని ప్రకటించారు. బీజేపీ నాయకులకు మీ జైళ్లు సరిపోవని ఎద్దేవా చేశారు. మాట తప్పం.. మడమ తిప్పం అని సవాల్ చేశారు.
 
ఆడబిడ్డ అని చూడకుండా పోలీసులు అడ్డుకున్నారని అంటూ పోలీసుల ముందు టీఆర్ఎస్ నాయకులు పెట్రోల్ పోసి తగలబెట్టే పరిస్థితి ఉందని ఆరోపించారు. అసలు ఈ తెలంగాణలో శాంతి, భద్రతలున్నాయా? ఈ పోలీసులు శాంతి, భద్రతల కోసం ఉన్నారా?  ప్రతిపక్షాలను అణిచివేయడం కోసం ఉన్నారా? అని నిలదీశారు. ఇంతటి దుర్మార్గం ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
ఈ కేసీఆర్ తెలంగాణను ఎటు తీసుకపోతున్నారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ తెలంగాణలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని, ఈ రోజు రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా, మద్యం తెలంగాణాగా మార్చేశారని ఆరోపించారు. ఈ మధ్య తాను మునుగోడులోని ఓ గ్రామానికి వెళ్లినపుడు.. అక్కడ ఎన్ని మద్యం షాపులున్నాయని అడిగితే 50మందికి ఒకటి చొప్పున, ముప్పై మందికి ఒకటి బెల్టు షాపులున్నాయని చెప్పారని కిషన్ రెడ్డి తెలిపారు.
 
కేసీఆర్ సాధించిన ఘనత ఇది అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కు ప్రధాని మీద, గవర్నర్ మీద, ఉద్యమాల మీద గౌరవముండదని మండిపడ్డారు. పోలీసులను టీఆర్ఎస్ ఏజెంట్ల లాగా వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తున్న పార్టీలను పోలీసులు అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తా
 
తాము అధికారంలోకి రాగానే బైంసా పేరును మైసాగా మారుస్తామని బండి సంజయ్ వెల్లడించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బైంసాను దత్తత తీసుకుంటామని ప్రకటించారు. బైంసాకు భరోసా ఇవ్వడానికే ఈ యాత్ర చేపట్టామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రంలో కాషాయం జెండా రెపరెపలాడాలని చెప్పుకొచ్చారు.
 
తాము అధికారంలోకి రాగానే బైంసాలోని బీజీపే కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులు, పీడీ యాక్ట్ లను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు. ఒకవైపు దేశం అభివృద్ధి చెందుతుంటే.. తెలంగాణ మాత్రం అదోగతి పాలైతుందని సంజయ్ ఆరోపించారు. రూ.5 లక్షల కోట్లు ఎక్కడ పెట్టారో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
 
ఒక్క సంవత్సరం లోపల పది లక్షల ఉద్యోగాలిస్తనన్న నరేంద్ర మోదీ ఒక్క రోజులోనే 75వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలిచ్చారని చెప్పారు. కేసీఆర్ మాత్రం ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించారు. ముథోల్ లో ఎంత మందికి నిరుద్యోగ భృతి ఇచ్చినవ్, ఎంతమంది రైతులకు రుణమాఫీ చేసినవ్.. ఎందుకు అభివృద్ధి చేయడం లేదని నిలదీశారు.
 
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తాము సమస్యలు పరిష్కారం చేయమని నిరసన చేస్ ఈ రోజు వాళ్లపై ర్యాగింగ్ కేసులు పెడ్తామని, వాళ్ల సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేస్తామంటున్నాడని  సంజయ్ ఆరోపించారు. వాళ్లు అడిగింది గొంతెమ్మ కోరికలేం కాదని చెబుతూ కాంట్రాక్టర్ నీ చుట్టపోడు కాబట్టే.. ఉద్యమం చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు పెడ్తున్నరని ఆరోపించారు. వారిపై కేసులు పెడితే తాము దేనికైనా తెగించి, కోట్లాడతామని స్పష్టం చేశారు.