* ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేత సతీసన్‌కు ముస్లిం లీగ్ మద్దతు
కేరళ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమెక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) అధికారం చేపట్టే అవకాశాలున్నట్ లు పలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడంతో ఆ పార్టీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి కోసం కుమ్ములాటలు ప్రారంభమయ్యాయి. అంతర్గత కుమ్ములాటలు కారణంగానే హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అధికారం పొందలేకపోయామని గ్రహించిన కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో తమ విబేధాలను పక్కనబెట్టి ఉమ్మడిగా గెలుపుకో సం కృషి చేశారు.
అయితే ఇప్పుడు అధికారం వచ్చే అవకాశం కనిపిస్తుండడంతో ముఖ్యమంత్రి పదవి కోసం పరుగు ఆ పార్టీలో ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ పదవికోసం గత ఐదేళ్లుగా ప్రతిపక్ష నేతగా సిపిఎం నేతృత్వంలోనే ఎల్డిఎఫ్ ను ఎదుర్కోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన వి.డి. సతీసన్ మొదటి నుండి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయనకు మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) తన మద్దతును ప్రకటించింది.
దశాబ్దం తర్వాత కేరళలో ఈ కూటమి తిరిగి అధికారంలోకి రావచ్చని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు సూచించడం పాటు సతీసన్ అత్యంత ప్రాధాన్యత కలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా తెలిపాయి. ఈ విషయాన్నీ ప్రస్తావిస్తూ, ఐయూఎంఎల్ రాష్ట్ర అధ్యక్షుడు సాదిక్ అలీ షిహాబ్ తంగల్ మలప్పురంలో మీడియాతో మాట్లాడుతూ “ఇది ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది” అని పేర్కొన్నారు.
“ప్రజలు తమ అభిప్రాయాలను ఆ విధంగా వ్యక్తం చేసి ఉండవచ్చు. నాకు అదే అనిపిస్తుంది. ముఖ్యమంత్రి పదవిపై కాంగ్రెస్ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని వారు నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము. మంత్రివర్గ ఏర్పాటులో ఐయూఎంఎల్‌కు తగిన ప్రాధాన్యత లభిస్తుందని మేము ఆశిస్తున్నాము,” అని ఆయన తెలిపారు.
గతంలో, ముఖ్యమంత్రి పదవికి సీనియర్ నాయకులైన సతీసన్, రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్ పేర్లు ప్రధాన పోటీదారులుగా వినిపించినప్పుడు, ఐయూఎంఎల్ సరైన సమయంలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తామని చెప్పింది. “గత ఐదేళ్లుగా పినరయి విజయన్ ప్రభుత్వంతో పోరాడుతూ యూడీఎఫ్‌కు నాయకత్వం వహించిన సతీసన్‌కు ప్రజాభిప్రాయం అనుకూలంగా ఉంది.
అయితే, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి కుడిభుజంగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా సంస్థాగత వ్యవహారాలు చూస్తున్న వేణుగోపాల్ ఎమ్యెల్యే సీట్లను కేటాయించడంలో కీలక పాత్ర వహించారు. దానితో కాంగ్రెస్ ఎమ్యెల్యేలు అత్యధికంగా ఆయనకే మద్దతు తెలిపే అవకాశం ఉందని, కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయన వైపే మొగ్గు చూపవచ్చని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
మరోవంక, అత్యంత సీనియర్ నాయకుడిగా, చెన్నితాల కూడా బలమైన పోటీదారుగా ఉన్నారు. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఉన్నందున, చెన్నితాల సోనియా గాంధీకి సన్నిహితుడు. ఎన్నికైన శాసనసభ్యుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకున్నప్పటికీ, 140 మంది సభ్యులున్న అసెంబ్లీలో కూటమి స్వల్ప మెజారిటీతో గెలిస్తే, యూడీఎఫ్‌లో రెండవ అతిపెద్ద పార్టీ అయిన ఐయూఎంఎల్ పాత్ర నిర్ణయాత్మకంగా ఉండే అవకాశం ఉంది.
నిర్ణయాలు తీసుకునే విషయంలో ఐయూఎంఎల్ కాంగ్రెస్‌ను తెరవెనుక నుండి నడిపిస్తోందన్న విమర్శలను కేరళ కాంగ్రెస్ తరచుగా ఎదుర్కొంటోంది. ఈ ప్రచార కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర వర్గాలకు కాంగ్రెస్ పార్టీని దూరం చేసిందని ఆరోపణలు ఉన్నాయి. గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి పోటీదారులు కేవలం రాష్ట్ర స్థాయి నాయకులకు మాత్రమే పరిమితం కాలేదు. కాంగ్రెస్ అధిష్టానంలో కీలక సభ్యుడైన వేణుగోపాల్ పోటీలోకి దిగడంతో, ఈ పోరు మరింత సంక్లిష్టంగా మారింది.
గతంలో, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితులు తలెత్తితే, పార్టీ అధిష్టానం సీనియర్ నాయకులకు కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతలు అప్పగించడం ద్వారా వారిని సంతృప్తి పరిచేది. ఉదాహరణకు, 1995లో సీనియర్ నాయకుడు కె. కరుణాకరన్ ముఖ్యమంత్రి పదవిని ఎ.కె. ఆంటోనీకి అప్పగించాల్సి వచ్చినప్పుడు, పార్టీ ఆయనకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించింది.
అదే విధంగా, 2004లో ఆంటోనీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి, ఊమెన్ చాందీకి మార్గం సుగమం చేసినప్పుడు, ఆయనకు కూడా యుపిఎ ప్రభుత్వంలో ఒక కీలక బాధ్యత అప్పగించారు. అయితే, ప్రస్తుతం కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో లేకపోవడంతో, కేరళ ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీకి విశేష ప్రాధాన్యత ఏర్పడింది.
ఐయూఎంఎల్ సతీశన్‌కు మద్దతు ప్రకటించడంపై ప్రముఖ హిందూ నాయకుడు, ఎస్ఎన్డిపి యోగం ప్రధాన కార్యదర్శి వెల్లపల్లి నటేశన్ స్పందిస్తూ “ఒకవేళ యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్ర పాలన మొత్తం ఐయూఎంఎల్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, వారు ఉప ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేస్తారు” అని ఎద్దేవా చేశారు.
యూడీఎఫ్ కూటమిలో మంత్రిత్వ శాఖల కేటాయింపులను నిర్ణయించి, ప్రకటించేది కూడా ఐయూఎంఎల్నే అని స్పష్టం చేశారు. “కాంగ్రెస్ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే విషయాన్ని ‘లీగ్’ (ఐయూఎంఎల్) ప్రస్తావించి ఉండకూడదు. యూడీఎఫ్ పాలనలో ఏం జరగబోతుందో మాకు బాగా తెలుసు. ఐయూఎంఎల్ పార్టీ రాష్ట్రంలో సమస్యలను సృష్టించి, అరాచకానికి దారితీస్తుంది,” అని ఆయన హెచ్చరించారు.

More Stories
సగంకు పైగా దేశాలలో `కఠినంగా’ పత్రికా స్వేచ్ఛ
దేశానికే ‘దిక్సూచి’ హైదరాబాద్ పోలీసుల ‘ఆపరేషన్ ఆక్టోపస్’
మొలకెత్తిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి