నల్సార్ వివాదంలో బార్ కౌన్సిల్ చైర్మన్ క్షమాపణలు

నల్సార్ వివాదంలో బార్ కౌన్సిల్ చైర్మన్ క్షమాపణలు
నల్సార్ లా విశ్వవిద్యాలయం ప్రవేశాల వివాదంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బిసిఐ) జోక్యంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్రంగా విమర్శించిన ఒక రోజు తర్వాత, బిసిఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా శనివారం న్యాయ విద్యార్థులకు క్షమాపణలు చెప్పారు. ఈ వివాదానికి సంబంధించి, తన మాటలు లేదా లేఖతో సహా ఏ విషయం అయినా వారి మనోభావాలను దెబ్బతీసి ఉంటే, అందుకు తాను మనస్ఫూర్తిగా చింతిస్తున్నానని ఆయన తెలిపారు. 
 
“నా ప్రియమైన యువ మిత్రులారా” అని సంబోధిస్తూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాసిన లేఖలో మిశ్రా, గత కొన్ని రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు విద్యార్థి సమాజంలోని ఒక వర్గంలో “ఆందోళన, వేదన” కలిగించాయని పేర్కొన్నారు. విద్యార్థులు బాధపడినప్పుడల్లా లేదా మనస్తాపం చెందినప్పుడల్లా, వారి సమస్యలను “ఓర్పుతో, సున్నితత్వంతో, గౌరవంతో” వినాలని ఆయన అంగీకరించారు. 
 
“ప్రస్తుత వివాదానికి సంబంధించి నా మాటలు లేదా లేఖ ఏదైనా మన న్యాయ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీసి ఉంటే, అందుకు నేను మనస్ఫూర్తిగా చింతిస్తూ క్షమాపణలు కోరుతున్నాను,” అని మిశ్రా చెప్పారు. “అలా చెప్పడానికి ఎలాంటి సంకోచం ఉండకూడదు. విచారం వ్యక్తం చేయడం అనేది ప్రతిష్టకు లేదా అహంకారానికి సంబంధించిన విషయం కాదు. అది కేవలం మన విద్యార్థుల భావాలు, ఆందోళనలకు విలువ ఉందని అంగీకరించడమే,” అని ఆయన పేర్కొన్నారు. 
 
నల్సార్ వివాదంలో జోక్యం చేసుకునే అధికారం బీసీఐకి లేదని, విద్యార్థుల నిరసనలు చట్టబద్ధంగా, శాంతియుతంగా ఉన్నంత వరకు వారికి నిరసన తెలిపే హక్కు ఉందని సీజేఐ కాంత్ స్పష్టం చేసిన ఒక రోజు తర్వాత ఈ క్షమాపణ వచ్చింది. సీజేఐ కాంత్ నేతృత్వంలోని, జస్టిస్‌లు జయమాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం, ఈ వివాదానికి సంబంధించి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు లేదా ఇతర విశ్వవిద్యాలయాల విద్యార్థులు, అధ్యాపకులపై ఎలాంటి శిక్షాత్మక లేదా క్రిమినల్ చర్యలు తీసుకోకుండా బీసీఐని, అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను కూడా నిరోధించింది.
 
హైదరాబాద్‌లోని నల్సార్ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ ప్రవేశాల విషయంలో బీసీఐ తన నిర్ణయాన్ని నాటకీయంగా మార్చుకున్న నేపథ్యంలో కోర్టు జోక్యం చేసుకుంది. గురువారం నాడు, “తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు” విద్యార్థులను చేర్చుకోవద్దని అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను కౌన్సిల్ తొలుత ఆదేశించింది. కొన్ని గంటల తర్వాత, అది నిలుపుదలను ఉపసంహరించుకుంది. అయితే, కొంతమంది ఉపాధ్యాయులు, బయటి వ్యక్తులు విద్యార్థులను రెచ్చగొట్టారని లేదా తప్పుదారి పట్టించారని వచ్చిన ఆరోపణలపై విచారణను కొనసాగించింది.
 
శుక్రవారం, 2026 బ్యాచ్ మొత్తంపై విచారణను ముగిస్తున్నట్లు మిశ్రా ప్రకటించారు. తాజా లేఖ ఈ వివాదానికి ముగింపు పలికేందుకు మరింత ముందుకు వెళ్తూ, న్యాయశాస్త్ర విద్యార్థులు తమ సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోవడానికి స్వేచ్ఛగా ఉండాలని మిశ్రా నొక్కి చెప్పారు. “మన న్యాయ విద్యార్థులు, ముఖ్యంగా జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రముఖ న్యాయ విద్యా కేంద్రాలలో చదువుతున్న వారు, దేశంలోని అత్యంత విజ్ఞానవంతులు, వివేకవంతులైన యువ పౌరులలో ఒకరు” అని మిశ్రా పెక్రోన్నారు.
 
వారు రాజ్యాంగం, చట్టబద్ధ పాలన, నిష్పక్షపాత వైఖరి, ఒక నిర్ణయానికి వచ్చే ముందు అన్ని పక్షాల వాదనలు వినవలసిన ప్రాముఖ్యత గురించి అధ్యయనం చేస్తారని, “తమ కోసం ఎవరూ నిర్ణయం తీసుకోవలసిన అవసరం లేదని” ఆయన తెలిపారు. మిశ్రా భిన్నాభిప్రాయం ప్రాముఖ్యతను కూడా అంగీకరిస్తూ, శాంతియుత విభేదం, ప్రశ్నించడం, నిరసన అనేవి “రాజ్యాంగ ప్రజాస్వామ్యం ముఖ్య లక్షణాలు” అని, విద్యార్థులు “తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఎల్లప్పుడూ స్వేచ్ఛగా ఉండాలి” అని స్పష్టం చేశారు. 
 
అదే సమయంలో, మరిన్ని వాస్తవాలు లేదా స్పష్టతలు వెలువడినప్పుడు విషయాలను పునఃపరిశీలించవచ్చని ఆయన సూచించారు. “నిజమైన ఫిర్యాదును వ్యక్తం చేయడానికి, ఆ తర్వాత ఒక స్పష్టతను నిష్పక్షపాతంగా పరిగణించడానికి మధ్య ఎటువంటి వైరుధ్యం లేదు,” అని ఆయన చెప్పారు. నల్సార్ స్నాతకోత్సవం గురించి కూడా ప్రస్తావిస్తూ, హాజరు కావాలా వద్దా అనే నిర్ణయం అంతిమంగా విద్యార్థులదే అయి ఉండాలని బీసీఐ ఛైర్మన్ తెలిపారు.
 
“ఏ విద్యార్థినీ హాజరు కావాలని బలవంతం చేయకూడదు. అలాగే హాజరు కాకూడదని ఎవరూ భావించకూడదు,” అని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని సంపూర్ణంగా పరిశీలించిన తర్వాత స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది తమ స్నాతకోత్సవానికి సీజేఐ కాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని నల్సార్ విద్యార్థులలో ఒక వర్గం అభ్యంతరం తెలపడంతో ఈ వివాదం చెలరేగింది. 
 
ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు అతిక్రమించారని ఆరోపిస్తూ, విచారణ సందర్భంగా సీజేఐ కాంత్ చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఉటంకించారు. రాజ్యాంగ హక్కులు, న్యాయం అందరికీ అందుబాటులో ఉండటం, సమస్యల పట్ల హేతుబద్ధంగా వ్యవహరించడం వంటి నల్సార్ నిబద్ధతకు ఆయన ఆహ్వానం అనుగుణంగా ఉందా? అని వారు ప్రశ్నించారు. 
 
స్నాతకోత్సవంలో సీజేఐ పాల్గొనడాన్ని వ్యతిరేకిస్తూ ప్రచారాన్ని ప్రారంభించిన, నిర్వహించిన, సమన్వయం చేసిన లేదా సమీకరించిన వారిని గుర్తిస్తూ, నల్సార్ నుండి ప్రామాణికమైన నివేదికను బీసీఐ తదనంతరం కోరింది. కానీ ఈ జోక్యం తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించి, శుక్రవారం సుప్రీంకోర్టు విచారణకు దారితీసింది.  సీనియర్ న్యాయవాది కె. పరమేశ్వర్ ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు, సీజేఐ కాంత్ ఇలా పేర్కొన్నారు: “ఈ విషయంలో బీసీఐ అనవసరంగా చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులకు నిరసన తెలిపేందుకు ఒక కారణం లేదా హేతువు ఉంటే, వారికి నిరసన తెలిపే హక్కు ఉంది. వారిని ఎవరూ ఆపలేరు.  మేము దీనిని అనుమతించము.” 
 
విద్యార్థులు చట్టబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నంత కాలం, “తమ గళాన్ని వినిపించే హక్కు వారికి ఉంది” అని చెబుతూ, విద్యార్థి ఉద్యమాలపై తనకున్న అనుభవాన్ని కూడా సీజేఐ ఉదహరించారు. “మనం విశాల హృదయంతో ఉండాలి. వారిని మాట్లాడనివ్వాలి. వారు చెప్పేది తప్పయినప్పటికీ, వారికి మాట్లాడే హక్కు ఉంది,” అని ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. 
 
నల్సార్ విద్యార్థులకు సంబంధించిన నిర్ణయం తీసుకోవడానికే బీసీఐ కౌన్సిల్‌ను నిజంగా సమావేశపరిచారా? అని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఈ ప్రక్రియను కోర్టుకు ఇచ్చే సమాధానంలో వివరించాలని కౌన్సిల్‌ను కోరింది. బీసీఐ ఛైర్మన్ శనివారం రాసిన లేఖ ఇప్పుడు ఘర్షణకు బదులుగా రాజీకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతుంది. “న్యాయవ్యవస్థ, బార్, విశ్వవిద్యాలయాలు, న్యాయ విద్యార్థుల మధ్య సంబంధం ఏదైనా తాత్కాలిక వివాదం కంటే చాలా లోతైనది. శాశ్వతమైనది” అని మిశ్రా తెలిపారు. 
 
విభేదాలు చివరికి “సంభాషణ, వివరణ, పరస్పర గౌరవం” ద్వారా పరిష్కరించబడాలని ఆయన సూచించారు. బీసీఐ న్యాయ విద్యార్థులను న్యాయ వృత్తి భవిష్యత్తుగా భావిస్తుందని, వారి “గౌరవం, భావ స్వాతంత్ర్యం, చట్టబద్ధమైన ఆందోళనలను ఎల్లప్పుడూ గౌరవించాలి” అని ఆయన పేర్కొన్నారు. ఈ వివాదం “బయటి ప్రభావం ద్వారా రాజకీయ లేదా అసంబద్ధమైన రంగు” సంతరించుకోకూడదని మిశ్రా విజ్ఞప్తి చేశారు. 
 
వాస్తవాలను పరిశీలించడానికి, అందించిన వివరణను పరిగణనలోకి తీసుకోవడానికి, వారి స్వంత స్వతంత్ర నిర్ణయం తీసుకోవడానికి విద్యార్థులు తగినంత పరిణతి చెందారని ఆయన అంగీకరించారు. “ఈ విషయాన్ని విద్యార్థులే స్వయంగా పరిశీలించుకోనివ్వండి. ప్రతి సంస్థ వారి భావ స్వాతంత్ర్యాన్ని గౌరవించాలి,” అని ఆయన చెప్పుకొచ్చారు.