తెలంగాణాలో మూడు సాగు నీటి పథకాలకు కేంద్రం ఆమోదం

తెలంగాణ సాగునీటి రంగంలో మరో ముందడుగు పడింది. మ‌రో మూడు సాగునీటి ప్రాజెక్టుల‌కు టెక్నిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ ఆమోదం తెలిపింది. కేంద్ర జల్ శక్తి కార్యదర్శి పంకజ్ కుమార్ అధ్యక్షతన ఢిల్లీలో టీఏసీ భేటీ జరిగింది. ఈ భేటీలో భూపాలపల్లిలోని ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం, నిజామాబాద్‌లోని చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోలతో పాటు ఆదిలాబాద్‌లోని చనకా- కొరాట ఆనకట్టకు కేంద్ర జల శక్తి ఆమోదం తెలిపింది.
 
ఈ ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి అడ్వైజరీ కమిటీ మినిట్స్ త్వరలోనే జారీ చేయనున్నట్లు కేంద్రం ఓ ప్రకటనలో పేర్కొంది. .  సెప్టెంబ‌ర్‌ 2021లో కేంద్ర జ‌ల‌ సంఘానికి, గోదావ‌రి రివ‌ర్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌ల‌ను అందించింది. కేంద్ర జ‌లసంఘంలో ఉన్న వివిధ డైరెక్టరేట్లు డీపీఆర్‌ల‌కు ఆమోదం తెలిపాయి. 3 ప్రాజెక్టుల‌కు టెక్నో ఎక‌నామిక్ క్లియ‌రెన్స్ ఇవ్వవచ్చని కేంద్ర జ‌ల సంఘం సిఫార‌సు కూడా చేసింది.
 
మంగళవారం జరిగిన టీఏసీ భేటీలో మూడు ప్రాజెక్టుల‌పై చ‌ర్చించారు. టీఏసీ స‌భ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు తెలంగాణ ప్రతినిధులు ఇచ్చిన సమాధానాలకు సంతృప్తి చెంది మూడు ప్రాజెక్టులకు టీఏసీ ఆమోదాన్ని ప్రకటించింది.

టీఏసీ సమావేశంలో తెలంగాణ తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్, ఇంజినీర్ ఇన్ చీఫ్‌లు సీ మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, మధుసూధన్, సీఎం ఒఎస్‌డీ శ్రీధర్ రావు దేశ్ పాండే పాల్గొన్నారు. తెలంగాణ మూడు ప్రాజెక్టులను ఆమోదించినందుకు కమిటీ ఛైర్మన్ పంకజ్ కుమార్‌కు, సభ్యులకు రజత్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు.