సంజయ్ పాదయాత్ర నుండి దృష్టి మళ్లించడం కోసమే షర్మిల అరెస్ట్ !

వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తెలంగాణలో 3,000కు పైగా కి మీ పాదయాత్ర చేస్తుండగా, ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్, అధికార పార్టీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తుండగా గత సంవత్సరంకు పైగా ఎవ్వరు పెద్దగా పట్టించుకోవడం లేదు. స్థానిక టిఆర్ఎస్ నేతలు ఆమె విమర్శలను ఖండిస్తూ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ఆమె పాదయాత్రను రాజకీయంగా తమకు ముప్పుగా భావించడం లేదు. పైగా, ఆమె ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లలో కొద్దిగానైనా చీలిక తేవచ్చని లోలోపల సంబరపడుతున్నారు.

అయితే అకస్మాత్తుగా వరంగల్ జిల్లాలో స్థానిక ఎమ్యెల్యేపై ఆమె వివాదాస్పద వాఖ్యలు చేశారనే సాకుతూ ఆమె యాత్రపై సోమవారం హింసాయుత దాడులకు దిగడం, పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం, ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేయడం; ఆమె మంగళవారం `ప్రగతి భవన్’ ముట్టడి అంటూ బయలుదేరడం, ఆమెను నాటకీయంగా క్రేన్ తో అరెస్ట్ చేసి, సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్ లో ఉంచి, సాయంత్రం మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచడం, ఆమె బెయిల్ పై ఇంటికి వెళ్లడం చూస్తుంటే … అంతా ఓ నాటకీయ పర్వంగా భావించవలసి వస్తున్నది.

బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ బైంసా నుండి ప్రారంభింప దలచిన  ఐదవ విడత ప్రజా సంగ్రామం యాత్రకు బయలుదేరిన తర్వాత ఆదివారం సాయంత్రం ఆయన యాత్రకు ఇచ్చిన అనుమతిని రద్దు చేయడం, అందుకు నీరసంగా పలుచోట్ల బిజెపి కార్యకర్తలు నిరసనకు దిగడం జరిగింది.  ఏది ఏమైనా యాత్ర ప్రారంభిస్తానని సంజయ్ చెప్పడం, ఆ తర్వాతనే సోమవారం ఉదయం షర్మిల యాత్రపై టిఆర్ఎస్ కార్యకర్తలు హింసాయుతంగా దాడికి పాల్పడటం జరిగింది.

అంతలో హైకోర్టు నుండి యాత్రకు బిజెపి అనుమతి పొందగలగడం, మంగళవారం భైంసా వెలుపల బహిరంగసభకు సిద్దపడటం జరిగింది. ఆ సభ ప్రారంభం కావడానికి కొద్దిసేపు ముందే షర్మిల ప్రగతి భవన్ వైపుకు వచ్చే ప్రయత్నం చేయడం, పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించడం చేశారు.  కుమార్తెను చూడటం కోసం పోలీస్ స్టేషన్ కు బయలుదేరుతున్న వై ఎస్ విజయలక్ష్మిని ఇంటివద్దనే కట్టడి చేసి, హౌస్ అరెస్ట్ అనడం, అక్కడ ఆమె నిరాహారదీక్ష చేపట్టడం జరింగింది.

భైంసా సమీపంలో బిజెపి బహిరంగ సభ పూర్తయిన తర్వాత షర్మిలను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, వాదనల అనంతరం ఆమెను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఇదంతా చూస్తుంటే, ఆమెను రెచ్చగొట్టడం కోసమే ఆమె వాహనాలపై టిఆర్ఎస్ కార్యకర్తలు హింసాయుత దాడులకు పాల్పడినట్లు భావించవలసి వస్తుంది.

బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించడం గురించి ప్రజలు ఎక్కువగా చర్చించుకోకుండా చేయడం కోసం ఆమె యాత్రపై దాడులు జరిపినట్లు అర్ధం అవుతుంది. భైంసా వద్ద బిజెపి బహిరంగ సభ నుండి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే తిరిగి హైదరాబాద్ నాటకీయంగా, ఆమె అరెస్ట్ వంటి సంఘటనలు చోటుచేసుకున్నట్లు కనిపిస్తున్నది.

ఇటు సంజయ్ విషయంలో గాని, అటు షర్మిల విషయంలో గాని వారి మద్దతుదారులు ఎటువంటి రెచ్చగొట్టే ప్రసంగాలు గాని, చర్యలకు గాని పాల్పడలేదు. కేవలం ఆమెపై దాడి చేయడం ద్వారా టీఆర్ఎస్ శ్రేణులే హింసాయుత చర్యలకు పాల్పడ్డారు. అయితే వారెవ్వరిపై ఎటువంటి చర్యలు తీసుకొనక పోవడం గమనార్హం.