ఎంపీ అరవింద్ ఇంటిపై దాడిలో పీహెచ్.డీ విద్యార్థులు

బంజారాహిల్స్ లోని బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసంపై టిఆర్ఎస్ శ్రేణులు జరిపిన దాడిలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన పీహెచ్ డీ విద్యార్థులు కూడా ఉన్నట్లు వెల్లడైంది. నాంపల్లి కోర్టుకు పోలీసులు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో దాడి ఘటనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థులతో పాటు మొత్తం 9 మంది టిఆర్ఎస్ కార్యకర్తలకు జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని బంజారా హిల్స్ పోలీసులు కోర్టును కోరారు. 
 
ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవితను అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎంపీ అరవింద్ ఇంటిపై దాడి చేసిన కేసులో తెలంగాణా జాగృతి నేత నవీనా చారి, తెలంగాణా జాగృతి కన్వీనర్ రాజీవ్ సాగర్ నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వారిరువురూ పరారీలో ఉన్నారు. 
 
కవితపై ఎంపీ అరవింద్ తన ప్రెస్ మీట్ లలో వ్యక్తిగతంగానూ, రాజకీయంగానూ విమర్శలు చేశారని పేర్కొన్న పోలీసులు, అరవింద్ చేసిన వ్యాఖ్యలతో టిఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి ముందు ఆందోళనకు దిగాలని నిర్ణయించుకున్నారని, అయితే అరవింద్ ఇంటి ముందు తగినంత పోలీసులు లేకపోవడంతో నిందితులు టిఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఇంట్లోకి చొరబడి దాడి చేశారని పేర్కొన్నారు. 
 
మొదట ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి రాళ్ళు విసిరారని, ఆపై పూల కుండీలు పగలగొట్టారని, కిటికీలు తలుపులు ధ్వంసం చేశారని పేర్కొన్నారు. అనంతర ఇంట్లోకి చొరబడి పూజ గదితో సహా అన్ని గదులలో ఉండే వస్తువులు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. 
 
దీంతో పోలీసులు నిందితులపై అతిక్రమణ, ఆస్తి నష్టం, బెదిరింపు వంటి అభియోగాలు మోపి కేసు నమోదు చేసినట్లు గా పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో 2 సిమెంట్ రాళ్లు, 2 టిఆర్ఎస్ పార్టీ జెండాలు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఇక ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని, మీడియాలో కూడా ప్రసారం చేయబడ్డాయి అని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో వివరించారు.