సావర్కర్ ను విమర్శిస్తూ రాహుల్ పొరపాటు చేస్తున్నారు!

దేశం కోసం కఠిన కాలాపానీ జైలులో క్రూరాతి క్రూర శిక్షలకు గురైన మహనీయుడు వినాయక్ దామోదర్ సావర్కర్ ను నిందిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పదే పదే విమర్శిస్తూ పొరపాటు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ  విజయశాంతి హెచ్చరించారు. 
 
“సావర్కార్ నాడు బ్రిటిష్ అధికారులకు ఇచ్చిన లేఖలో వాడిన పదజాలం గురించి రాహుల్‌గాంధీ మాట్లాడారు. అదే పదజాలాన్ని ఆనాడు బ్రిటిషర్ల ద్వారా జైలుపాలైన ఎందరో నేతలు… గాంధీ, నెహ్రూ సహా చాలామందే తమ లేఖల్లో ఉపయోగించిన రుజువులు ఇప్పటికే బయటకొచ్చాయి” అని ఆమె గుర్తు చేశారు. 
 
అంతేకాదు సావర్కర్‌ని రాహుల్ నానమ్మ, దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎంతగా అభిమానించారో రాహుల్‌కి తెలియకపోవడం ఎంతో విచారకరం అంటూ ఆమె ధ్వజమెత్తారు. ఇందిరా గాంధీ సావర్కర్ స్టాంప్ విడుదల చేయించారని, ముంబైలో సావర్కార్ స్మారకం కోసం వ్యక్తిగతంగా రూ.11 వేలు విరాళం ఇచ్చారని ఆమె గుర్తు చేశారు.
 
 సావర్కార్ జన్మస్థలాన్ని సైతం ఇందిర సందర్శించారని చెబుతూ  కాంగ్రెస్ నేతలు ఒక్కసారైనా సావర్కర్ జీవితచరిత్ర చదివితే ఈ నిజాలు తెలుస్తాయని ఆమె మండిపడ్డారు. రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడోయాత్ర  కేవలం ఇలాంటి విషప్రచారం కోసమేనేమో అనిపించేలా ఉండటం సమంజసం కాదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.