చిరంజీవి అద్భుతమైన వ్యక్తిత్వం అంటూ ప్రధాని కితాబు

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022 పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. 
 
చిరంజీవి విలక్షణమైన నటుడు అని ప్రధాని కొనియాడారు. విశిష్ట నటనా చాతుర్యంతో భిన్న రకాల పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్ని, ఆదరణను చూరగొన్నారని ప్రశంసించారు. తన అద్భుతమైన వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నారని కితాబునిచ్చారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ పురస్కారం అందుకుంటున్నందుకు చిరంజీవిని అభినందిస్తున్నానని తెలిపారు.
 
“చిరంజీవి గారు విలక్షణమైన నటుడు. అద్భుతమైన వ్యక్తిత్వంతో, విభిన్న నటనాచాతుర్యంతో అనేక పాత్రలు పోషించి కొన్ని తరాల ప్రేక్షకుల అభిమానాన్నీ , ఆదరణనూ చూరగొన్నారు. గోవా లో జరుగుతున్న భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో  విశిష్టమైన ఇండియన్  ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారానికి ఎంపికైన సందర్బంగా ఆయనకు అభినందనలు” అంటూ మోడీ ట్వీట్ చేశారు.
 ఏపీ గవర్నర్ బిష్వభూషణ్ హరిచందన్ కూడా మెగాస్టార్ చిరంజీవిని అభినందించారు.  చిరంజీవి నటుడిగా, సామాజిక సృహ కలిగిన వ్యక్తిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో సేవ చేశారని కొనియాడారు.
 
ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ సారి తెలుగు నుంచి ఏకంగా 5 చిత్రాలు ప్రదర్శితమవుతున్నాయి. అందులో భాగంగా రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రీసెంట్‌గా  ఈ చిత్రాన్ని జపాన్‌లో విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
ఇక బాలయ్య ద్విపాత్రాభినయంలో నటించిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ చిత్రాన్ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. ఈ చిత్రం 2021 డిసెంబర్ 2న విడుదలై మంచి సూపర్ హిట్‌గా నిలిచింది.
 
అడివి శేష్ హీరోగా నటించిన ‘మేజర్’ చిత్రాన్ని హిందీలో అక్కడ ప్రదర్శించనున్నారు. దేశ భక్తి నేపథ్యంలో మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా 26/11 ముంబై దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. 
 
దేశ స్వాతంత్య్రం కోసం అతిపిన్న వయసులో ప్రాణ త్యాగం చేసిన ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమా టైటిల్ లోగోను మాజీ భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు లాంఛ్ చేశారు. ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కాకపోయినా.. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శించనున్నారు. మరోవైపు మరో తెలుగు చిత్రం ’బండి’ ని ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. 

శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం

శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం  లభించింది. గోవాలో జరుగుతున్న53 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో రీస్టోర్‌డ్‌ ఇండియన్‌ క్లాసిక్‌ విభాగంలో ఈ చిత్రం ఎంపికైంది. దీంతో గోవాలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. 
 
 నేషనల్ ఫిల్మ్ అర్చివ్స్ ఆఫ్ ఇండియా వారు మనదేశంలోని గొప్ప చిత్రాలను డిజిటలైజ్‌ చేసి ప్రదర్శించనున్నారు. ఇందులో శంకరాభరణం చిత్రానికి చోటు దక్కి్ంది. కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాలన్ని పూర్ణోదయా క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.
జె. వి. సోమయాజులు, మంజుభార్గవి, అల్లు రామలింగయ్య ముఖ్య పాత్రలు పోషించారు. కె. వి. మహదేవన్ అందించిన సంగీతం ప్రేక్షకులకు బాగా ఆకట్టుకుంది. 1980 లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ హంగులు లేకున్నా ఘన విజయం సాధించి ఒక సంచలనం సృష్టించింది. గోవాలో ఈ చిత్ర ప్రదర్శనకు  ఏడిద నాగేశ్వరరావు కుమారుడు ఏడిద రాజా ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు.