మంత్రి తలసాని కుమారుడికి ఈడీ నోటీసులు?

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చికోటి ప్రవీణ్ కేసినో వ్యవహారంలో దర్యాప్తును ముమ్మరం చేసింది. నేపాల్ లో బిగ్ డాడీ పేరుతో నిర్వహించిన కేసినోకు వెళ్లినట్టుగా భావిస్తున్న వారికి వరుసగా నోటీసులు పంపుతూ, విచారణ చేస్తోంది. ఈ క్రమంలో తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయికిరణ్ యాదవ్ కు ఈడీ నోటీసులు జారీ చేసింది.

అయితే ఈడీ నోటీసులు ఇచ్చిందన్నట్టుగా వస్తున్న వార్తలను  సాయికిరణ్ కొట్టిపారేస్తూ  ట్వీట్ చేశారు. ఈడీ తనకు ఎలాంటి నోటీసులు పంపలేదని స్పష్టం చేశారు. తాను యువ రాజకీయ నాయకుడినని, ప్రజలకు తనవంతుగా సేవ చేయడానికి ప్రయత్నిస్తున్నానని ట్వీట్ లో  తెలిపారు.  

మరోవైపు ఇదే అంశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీశ్ సోమవారం ఈడీ ముందు హాజరయ్యారు. బ్యాంక్ స్టేట్మెంట్లతో ఈడీ విచారణకు హరీశ్ హాజరయినట్టు తెలుస్తున్నది. విదేశాల్లో క్యాసినో వ్యాపారం, ఫేమ నిబంధనల ఉల్లంఘనలపై ప్రశ్నించనున్నట్లు సమాచారం.

ఇంకోవైపు ఇప్పటికే తలసాని సోదరులు తలసాని మహేశ్, తలసాని ధర్మేందర్ యాదవ్ లు కూడా ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, ఏపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డిని కూడా ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఈడీ విచారణ సమయంలో ఎల్.రమణ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

ఈ కేసులో కీలక సూత్రధారి అయిన చికోటి ప్రవీణ్‌ను ఇప్పటికే విచారించిన అధికారులు అతను ఇచ్చిన సమాచారం మేరకు క్యాసినో ఆడడానికి ఎవరెవరు వెళ్లారో వారి సమాచారం సేకరించి, వారికి నోటీసులు ఇచ్చి, ఈడీ కార్యాలయానికి పిలిపించి విచారించి,  వారి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నారు.