అర్ధాంతరంగా ఆగి పోయిన కార్‌ రేసింగ్ లీగ్‌

 హుస్సేన్ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన ఇండియన్​ రేసింగ్ లీగ్(ఐఆర్​ఎల్​)లో  అడుగడుగునా నిర్వహణ లోపం బయటపడింది.  ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొన్న చాలా మందికి ప్రవేశం కూడా లభించలేదు. పైగా రెండు రోజుల్లో ఐదు ఐఆర్​ఎల్​  రేసులు జరగాల్సి ఉండగా  ఒక్క రేసు కూడా జరగలేదు. మొదటి రోజు ప్రాక్టీస్ తో, రెండో రోజు మూడు ప్రమాదాల కారణంగా కేవలం జేకే టైర్​ నేషనల్​ రేసింగ్​తో ముగించేశారు.  
శనివారం అట్టహాసంగా హైదరాబాద్ వేదికగా  ప్రారంభమైన  ఇండియా కార్ రేసింగ్ లీగ్ సాంకేతిక కారణాలతో అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వికటించింది. శనివారం టెస్ట్ రేసులు సజావుగానే జరగగా, ఆదివారం రేసర్లకు వరుస ప్రమాదాలు జరిగాయి. దీంతో పూర్తి స్థాయిలో రేస్ లు నిర్వహించలేక పోయారు. 
 
క్వాలిఫయింగ్ రేసులో కొత్త ట్రాక్ పై పలుమార్లు కార్లు ఢీకొని రేసర్లకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో లీగ్ నిర్వహణను ఆపేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. వరుస ప్రమాదాలపై దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.  కొత్త ట్రాక్ పై అలవాటు లేకపోవడం వల్లే ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. 
 
 క్వాలిఫైయింగ్ రేసులో వరుస ప్రమాదాల కారణంగా ఆదివారం రేస్ ఆలస్యంగా మొదలైంది. ఐమాక్స్ మలుపు వద్ద జరిగిన మరో ప్రమాదం ఆలస్యానికి కారణమైంది. 4 ఫార్ములా కార్లు బారికేడ్‌ను ఢీకొట్టిన ఈ ఘటనలో ఇద్దరు రేజర్లకు గాయాలయ్యాయి. చీకటి పడటంతో నిర్వాహకులు ముందుగానే నిలిపివేశారు. 
 
కాగా ట్రాక్‌కు రెండు రోజులు మాత్రమే అనుమతి ఉండడంతో  సోమవారం నిర్వహణకు అవకాశంలేదనే చెప్పాలి. దీంతో ఫార్ములా-3 రేస్ రద్దు చేసి, ఫార్ములా-4 రేస్ తో సరిపెట్టారు.  ఈ అనూహ్య నిర్ణయంతో ఆదివారం వేళ ఇంటర్నేషనల్ ఈవెంట్ చూద్దామని వచ్చిన  ఎంతోమంది అభిమానులు నిరాశతో వెనుదిరిగారు.

క్వాలిఫైయింగ్ రేసులో చెన్నై టీమ్ కు చెందిన రేసర్ కు గాయాలయ్యాయి. తర్వాత ఫార్ములా-4 రేసింగ్ లోనూ యాక్సిడెంట్ జరిగింది. టర్నింగ్స్ దగ్గర స్పీడ్ కంట్రోల్ తప్పడంతో ప్రమాదం జరిగింది. ఒక టర్నింగ్ దగ్గర మూడు కార్లు ఢీకొన్నాయి. 
దీంతో రేసింగ్ కు కాసేపు అంతరాయం ఏర్పడింది.  కొంత గ్యాప్ తర్వాత ఫార్ములా-4 రేసు పోటీలు జరిపారు. లైటింగ్ తగ్గడంతో..  ఫార్ములా -3 రేస్ క్వాలిఫయింగ్ జరపకుండానే లీగ్ ను ముగించారు.
శనివారం వీఐపీ గ్యాలరీలోకి మంత్రి కేటీఆర్ వచ్చిన సమయంలో గ్యాలరీ కుంగిపోయింది. ఆదివారం సౌకర్యాలు లేక ప్రేక్షకులు ఆందోళనకు దిగడంతో  అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రూ. 6 వేల నుంచి 12 వేల ఖరీదైనా టికెట్లు కొనుగోలు చేసి ఆదివారం లీగ్​ చూసేందుకు వచ్చిన వారికి చేదు అనుభవం ఎదురైంది. 
 
వీఐపీలతో పాటు ఖరీదైన టికెట్లు కొనుగోలు చేసిన వారి కోసం ప్రత్యేకంగా వీఐపీ గ్యాలరీలు ఏర్పాటు చేసినా.. ఆ గ్యాలరీలు అప్పటికే పోలీసులు, ఇతర అధికారుల కుటుంబాలతో నిండిపోయాయి. సామర్థ్యంకు మించి గ్యాలరీల్లో ప్రేక్షకులు ఉన్నారంటూ టికెట్లు కొన్న వారిని పోలీసులు ప్రవేశ ద్వారం​ వద్ద నిలిపివేశారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. 
 
ఈ పోటీలను రేసింగ్‌ ప్రమోషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అంతర్జాతీయ ఆటోమొబైల్‌ ఫెడరేషన్‌ సహకారంతో దేశంలోనే తొలిసారిగా ఈ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌)ను నిర్వహిస్తోంది. ఐఆర్‌ఎల్‌ పోటీలు ఫార్ములా రేసింగ్‌లోని ఎఫ్‌-3 స్థాయివి. ఇందులో హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ సహా ఆరు జట్లు తలపడుతున్నాయి. 
 
ఒక్కో జట్టు తరఫున ముగ్గురు పురుష, ఒక మహిళా డ్రైవర్‌ పోటీ పడనున్నారు. మొత్తం ఆరు జట్ల నుంచి 12 కార్లు, 24 మంది డ్రైవర్లు బరిలో ఉంటారు. హైదరాబాద్‌ టీమ్‌ నుంచి నగరానికి చెందిన ప్రముఖ ఫార్ములా డ్రైవర్‌ కొండా అనిందిత్‌ రెడ్డి బరిలో ఉన్నాడు.
 
తప్పుబట్టిన బిజెపి 
హైదరాబాద్ నడిబొడ్డున కార్ల రేస్ంగ్ నిర్వహించి ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించడాన్ని బీజేపీ తప్పుబట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరువల్ల నగర ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారని, అంబులెన్స్ సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు  బండి బండి సంజయ్ విమర్శించారు. 
 
కార్ల రేస్ కోసం నగరం నడిబొడ్డున సెక్రటేరియట్, ఐమాక్స్, నెక్లెస్ రోడ్లను దిగ్బంధించడం ఎంతవరకు సమంజసం? ట్రాఫిక్ సమస్య వల్ల ప్రజానీకానికి జరగరాని నష్టం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు. కార్ల రేసింగ్ నిర్వహణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని, అయితే అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నిర్వహించాలని సూచించారు.